మార్పు అనేది కాలధర్మం మరియు జీవిత ధర్మం కూడా! ఈరోజు మనం జీవిస్తున్న జీవితానికి భిన్నంగా మరింత మెరుగైన జీవితం కోసం మన మాటల్లో, చేతల్లో మార్పుని ఆహ్వానించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాం.
అయితే మన ప్రయత్నం యొక్క చిత్తశుద్ధిపై దాని ఫలితం ఆధారపడి ఉంటుంది. కొత్త సంవత్సరం వస్తోందంటే ప్రతీ ఒక్కరూ మనసులో సరికొత్త ఆశలను మోసుకెళ్తుం టారు. కాలెండర్‌లో జనవరి 1 అనే తేదీని ఎంత వేడుకగా చేసుకుంటామో, ఆ తేదీన ఏ నిర్ణయం తీసుకుంటే అది ఏడాది పొడవునా కొనసాగిస్తామని ఎంత నమ్ముతామో, అదే నమ్మకం మిగిలిన సందర్భాల్లో మన నిర్ణయాలపై ఎందుకు ఉండదు?
ఒక మనిషిగా మనం నిరంతరం మారాల్సిందే.. మనలో ఎన్నో లోపాలు. అపరిపక్వతలు వాటన్నింటినీ సరిచేసుకుంటూ సంపూర్ణమైన వ్యక్తిగా ఎదిగే విధంగా మనం కోరుకునే మార్పు ఉండాలి. ఆ మార్పు కోసం ఆరాటం అనేది నిరంతరం మనలో జ్వలించవలసిన కోరిక.
మనం మార్పు వైపు సాగించే ప్రయాణంలో అన్నీ మన అంచనాలకు అనుగుణంగా ఉండకపోవచ్చు. మనం ప్లాన్ చేసుకున్నామని, పరిస్థితులు మనకు తగ్గట్లు ప్లానింగై పోవు కదా! ఎవరి ధర్మం వారు నిర్వర్తిస్తుంటారు. వాటన్నింటినీ స్వీకరిస్తూ మనమెళ్లే మార్గాన్ని తేలికపరుచుకుంటూ ముందుకుసాగవలసిన విజ్ఞత కూడా మనకు ముఖ్యమే.