కవిత: నా గొప్పదనం

నా గొప్పదనం

అర్థరాత్రి..

ఆలోచనలతో నిద్ర దూరమై
అటూ ఇటూ పొర్లుతూ ప్రయత్నిస్తున్నా,
ఎంతకీ కళ్ళమీదకి నిద్ర రాకపోవడంతో
అసలెందుకిలా అవుతుందని,
ఏ ఆలోచన నన్నిలా చేస్తుందని
మరో ఆలోచన చేస్తే..
ఇప్పటివరకూ ఏం సాధించానన్న కొత్త ఆలోచన వచ్చింది.

 

ఇంతవయసు వచ్చాక, గొప్పదేదైనా సాధించానా అని
ఆలోచిస్తూ ఉండిపోయా

చిన్నప్పటి నుండి ఇప్పటివరకు
పెద్దగా చెప్పుకోదగ్గదేమీ చేయలేదని అర్థమైంది.
ఆహా! అనిపించేంత పని ఒక్కటీ చేయలేదన్న ఆలోచనకి
మెదడు బరువెక్కింది.
ఆ బరువుకి తల పక్కకి తిప్పాను.
నువ్వు కనిపించావు.

నా గురించి నీకేమీ పట్టినట్లు లేదు.
హాయిగా నిద్రపోతున్నావు.. చిన్నపిల్లలా.
అలా చూస్తూ ఉండిపోయా
బాగున్నావు.
పెద్ద కళ్ళు, పొడవాటి ముక్కు,
అందంగా ఉన్నావు.. కాదు కాదు అంతకుమించి.
ఇంత అందానికి నేనెలా నచ్చాననే
కొత్త ఆలోచన వచ్చింది.
ఒకట్రెండు సార్లు అడిగితే నవ్వి ఊరుకున్నావు.
అప్పుడింకా అందంగా కనిపించావు.
రేపొకసారి మళ్ళీ అడుగుతాను.
అప్పుడైనా చెప్తావా?
మళ్ళీ నవ్వుతావా?

నాకు తెలుసు..
నువ్వు నవ్వుతావు.. అప్పుడు నేనేం అనుకోవాలి?

అబ్బా ఈ ఆలోచనలు ఇలా చంపుతున్నాయేంటి?
నిద్రొస్తే బాగుండు కదా!
ఆలోచనల బారి నుండి తప్పించుకునేవాడిని.
ఆశ్చర్యం ఏంటంటే,
ఆలోచనలు దూరమైతే గానీ నిద్ర రాదు.
నిద్రొస్తే గానీ ఆలోచనలు దూరం కావు.
ఇలా రెండు విరుద్ధ భావావేశాల మధ్య
నలిగిపోతున్న నాపై ఏదో పడింది.

సాధారణంగా నా స్వభావానికి అలా పడితే,
షాక్ కొట్టినట్లు లేచి పడాలి.
కానీ నేనలా చేయలేదు.
ఆ పడిన తాలూకు స్పర్శ మెదడుని చేరి,
అప్పటివరకూ కలుగుతున్న ఆలోచనలను దూరం చేసింది.
ఆ వెచ్చదనం గుండెకు తగిలింది.
ఇన్ని కలగాపులగమైన ఆలోచనలను
క్షణంలో మాయం చేసే శక్తి దేనికి ఉందా అని ఆలోచించలేదు.
నాకు అర్థమైంది.. అది నువ్వేనని.
చాలాసార్లు మన పక్కనున్నవాళ్ళని పట్టించుకోం.
నీ చేతి స్పర్శకే నాలో ఆలోచనలు మారాయంటే,
జీవితంలో సాధించడానికి ఇంతకన్నా గొప్పదేం ఉంటుంది.

-శ్రీరామ్ ప్రణతేజ