బాధలో ఉన్నప్పుడు ఏం చేయాలి.. ఏం చేయకూడదో తెలుసా..?

మనకు చాలా దగ్గరైన వారు మనల్ని బాధపెడితే ఆ బాధ తట్టుకోవడం చాలా కష్టం. మనం చేసిన తప్పుల వల్ల మనమే హర్ట్ అయితే ఆ రిగ్రెట్ ఫీలింగ్ తట్టుకోవడమూ చాలా కష్టమే.  ఏదైనా బాధ నుంచి మనం కోలుకోవాలంటే కొందరికి కాస్త సమయమే పడుతుంది. కానీ మరికొందరికి మాత్రం చాలా రోజులు పడుతుంది. బాధ నుంచి విముక్తి పొంది సాధారణ జీవితానికి అలవాటు పడటానికి వాళ్లు చేసే జర్నీ చాలా క్లిష్టమైనది. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ కష్టమైన ప్రయాణం మీకు కాస్త సులువవుతుంది. బాధతో కుమిలిపోతున్న సమయంలో ఆ బాధను తట్టుకోవడానికి ఏం చేయాలి.. ఇలాంటి కష్టసమయంలో ఏం చేయకూడదో చెబుతున్నారు మానసికనిపుణులు ఎమిలీ హెచ్ సాండర్స్. అవేంటో మీరు చూసేయండి. మీ బాధను తగ్గించుకొని హాయిగా జీవించండి..

గతంలో మనం కొన్ని తప్పులు చేసుండొచ్చు. అవి కాలంతో పాటు మనల్ని పరీక్షిస్తాయి. ఆ తప్పులు మనల్ని వెంటాడుతూ ఉంటే మాత్రం వాటినే తలుచుకుని కుమిలిపోవద్దు. ఆ గతం నుంచి వీలైనంత త్వరగా బయటకు రావాలి. మనల్ని మనమే క్షమించుకుని ముందుకు సాగాలి. అలాంటి తప్పు మళ్లీ చేయను అని మీకు మీరు మాట ఇచ్చుకొని మీ లైఫ్ ని రీస్టార్ట్ చేయండి.

మన లైఫ్ లో చాలా విషయాలు మన నియంత్రణలో ఉండవు. అందుకే మన కంట్రోల్ లో లేని విషయాలను తలచుకుని మనల్ని మనం నిందించుకోకూడదు. మీ కంట్రోల్ లో లేని విషయాలపై మీరు శ్రద్ధ వహించొద్దు. ఏం జరగాలి అని ఉంటే అదే జరుగుతుంది. కానీ తప్పు జరగకుండా మీ వంతు ప్రయత్నం చేయండి చాలు. మీ నియంత్రణలో లేని విషయాల గురించి మిమ్మల్ని మీరు నిందించుకోకుండా లైఫ్ లో ముందుకు సాగండి. లేకపోతే మీరు నిస్సహాయంగా ఒంటరిగా మిగిలిపోతారు.

కొందరు చిన్నపాటి విషయాలపై హర్ట్ అవుతుంటారు. త్వరగా ఏడ్చేస్తారు. వీరికి భావోద్వేగాలు నియంత్రణలో ఉండవు. అలా అందరి ముందు వీరు తరచూ ఏడ్వటం వల్ల ఎదుటివారికి చాలా బలహీనంగా కనిపిస్తారు. కొందరు వీరి బలహీనతను అడ్వాంటేజ్ గా తీసుకుంటారు. అందుకే వీలైనంత వరకు చిన్నచిన్న విషయాలకు ఏడ్వకూడదు. కోపం, ఏడుపు, చిరాకు, బాధ వంటి భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. వీలైనంత త్వరగా వీటిని వదులుకుని అన్నీ మరిచిపోయి హాయిగా ఫ్యూచర్ కోసం రెడీ అయి పోవాలి.


మనం బాధలో ఉన్నప్పుడు మనకు నచ్చినవాళ్లు మనతో కాస్త టైం స్పెండ్ చేస్తే చాలు అనిపిస్తుంది. అందుకే మిమ్మల్ని ఇష్టపడే వాళ్లతో మీ బాధను పంచుకోండి. పంచుకుంటే బాధ తగ్గుతుందనే సామెత తెలుసుగా.. అందుకే మీ బాధను షేర్ చేసుకోండి. ఇది కొందరికి చాలా కష్టంగా అనిపిస్తుంది. బాధలను ఇతరులతో పంచుకోవడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ మీలో మీరే కుంగిపోవడం కంటే ఇతరులతో షేర్ చేసుకుంటే బాధ తగ్గిపోయి హాయిగా అనిపిస్తుంది.

మనం బాధను అనుభవించాం అని అంగీకరించటంలోనే మనం ఆ జ్ఞాపకాల నుంచి కోలుకోడానికి మొదటి అడుగు వేశాం అని అర్థం. ఆ అడుగుతో ముందడుగేసి మీ బాధ నుంచి వీలైనంత త్వరగా బయటపడండి. మానసికంగా దృఢంగా ఉండండి.

బాధతో ఉన్నప్పుడు ఒంటరిగా ఉండకుండా.. ఫ్రెండ్స్ తో కాసేపు గడపండి. మీకు నచ్చిన సినిమాలు చూడండి. నచ్చిన ప్రదేశాలకు ఇష్టమైన వారితో కలిసి వెళ్లండి. మీకు నచ్చిన వారితో మీ బాధను పంచుకోండి. జీవితం చాలా చిన్నది.. బాధతో లైఫ్ ని వేస్ట్ చేసుకోకుండా.. హాయిగా ముందుకు సాగండి. బతికినన్ని రోజులు హాయిగా.. హ్యాపీగా గడపండి. సమస్యలు, బాధలు అనేవి గెస్ట్ లాంటివి.. వచ్చి కొన్ని రోజులు ఉంటాయి అంతే. వాటిని కూడా ఎంజాయ్ చేయడం అలావాటు చేసుకుంటే మనం దృఢంగా తయారవుతాం.(Live Love Laugh)