అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మపై కేసు నమోదు

అస్సాం ముఖ్య‌మంత్రి హిమంత బిశ్వ‌శ‌ర్మ‌పై హైద‌రాబాద్‌లో కేసు న‌మోదు అయింది. జూబ్లీ హిల్స్ పోలీసులు బిశ్వ‌శ‌ర్మ‌పై కేసు న‌మోదు చేశారు. రెండు రోజుల క్రితం టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి చేసిన ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేశారు.ఐపీసీ 504, 505 క్లాజ్ 2 సెక్ష‌న్ల కింద అస్సాం సీఎంపై కేసు న‌మోదు చేశారు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్య‌మంత్రి బిశ్వ‌శ‌ర్మ అనుచిత వ్యాఖ్య‌లు చేసార‌ని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో రేవంత్‌రెడ్డి ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. 2016లో స‌ర్జిక‌ల్ స్ట్రైక్‌కు సంబంధించి ఆధారాలు బ‌య‌ట‌పెట్టాల‌ని రాహుల్‌గాంధీ ఇటీవ‌ల పార్ల‌మెంట్‌లో కేంద్రాన్ని ప్ర‌శ్నించారు. ఈ త‌రుణంలో అస్సాం ముఖ్య‌మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాహుల్ పుట్టుక‌పై తాము ఏమైనా రుజువులు అడిగామా..? అని ప్ర‌శ్నించ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అయింది. దేశ‌వ్యాప్తంగా ఈ వివాదం ఇప్పుడు న‌డుస్తోంది. ఈ వివాదం ఎప్పుడు స‌ద్దుమ‌నుగుతుందో చూడాలి.