తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ కృష్ణా జలాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు తక్కువ సమయం ఉండడంతో ఎలాగైనా మెజార్టీ సీట్లలో విజయం సాధించాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది.
పార్లమెంటరీ పార్టీ సమావేశం తర్వాత హరీష్ రావు మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా.. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేలకుండా ఆ బోర్డుకు ఎలా అప్పగిస్తారని హరీష్ రావు ప్రశ్నించారు. అలాగే అధికారులు ఇలా చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీలోని నేతలకు కాస్త సహనం అవసరం అని ఆయన సూచించారు.ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతుంటే.. కాంగ్రెస్ మంత్రులు సహనం కోల్పోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాక ముందే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని.. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడం కష్టం అని ఈ సందర్భంగా హరీశ్ రావు అన్నారు.