కాంగ్రెస్ ప్రభుత్వం పై బాల్క సుమన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.రైతుబంధు అడిగితే రైతులను చెప్పులతో కొడతారా.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యమంటే అని బాల్క సుమన్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఒకటి చెబితే.. మంత్రులు మరొకటి చేస్తూ రాష్ట్ర ప్రజలను ఆయోమయానికి గురిచేస్తున్నారని ఆయన అన్నారు. 75వ రిపబ్లిక్ డే సందర్భంగా నస్పూర్‌లోని మంచిర్యాల జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. తర్వాత బీఆర్‌ఎస్ భవన్‌లో మంచిర్యాల , చెన్నూర్ నియోజకవర్గం కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ…. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రెండు నెలలైనా గడవక ముందే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది అని అన్నారు.
ఎన్నికల్లో ఆచరణ సాధ్యంకాని 6 గ్యారంటీలు, 420 హామీలు వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారని బాల్క సుమన్ మండిపడ్డారు. చెన్నూర్‌లో 45 వేల మందికి ఉద్యోగాలు, మండలానికో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ,అగ్రికల్చర్ యూనివర్సిటీ నిర్మిస్తామని చెప్పి, దాని ఊసే ఎత్తడం లేదని ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో ఎన్నికలకు ముందు 7 మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.25 కోట్ల చొప్పున మంజూరు చేస్తే రద్దు చేయడం సరికాదని సూచించారు.