ఛత్తీస్‌గఢ్ పీసీసీ అధ్యక్షుడు భూపేశ్ బఘెల్‌ను ముఖ్యమంత్రిగా అధిష్టానం ప్రకటించింది. ఆదివారం ఉదయం శాసనసభాపక్ష సమావేశంలో భూపేశ్‌ను సీఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గే పేరును అధికారికంగా ప్రకటించారు. దీంతో సోమవారం భూపేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి సోనియాతో పాటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి రేసులో నలుగురు కాంగ్రెస్ నేతలు పేర్లు బలంగా వినిపించాయి. భూపేశ్‌తో పాటూ తామ్రధ్వజ్ సాహు, చరణ్‌దాస్, సింగ్‌దేవ్‌లు పోటీ పడ్డారు. తీవ్ర తర్జన భర్జన అనంతరం భూపేశ్ బఘెల్ ను ఎంపిక చేశారు. భూపేశ్ మధ్యప్రదేశ్‌లో దిగ్విజయ్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేసిన అనుభవం ఉంది. 15 ఏళ్ల తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలకపాత్ర పోషించారు.