తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సోమవారం కేటీఆర్ బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో తెరాస భవన్లో పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే తెరాస తొలి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ ని నియమిస్తూ… నిర్ణయం తీసుకోవడంతో కార్యకర్తల్లో నూతనోత్తేజం పెరిగింది. సోమవారం ఉదయం తెలంగాణ భవన్‌లో తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో కార్యక్రమం ఏర్పాట్లను తలసానితో పాటు మాజీమంత్రి దానం నాగేందర్, నగర మేయర్ బొంతు రామ్మోహన్ పలువురు ఎమ్మెల్యేలు పరిశీలించారు.
ఈ సందర్భంగా ..కేటీఆర్ కార్యాలయం పనులు, తెలంగాణ భవన్‌లో, తెరాస భవన్‌కు చేరుకునే మార్గంలో భద్రతా ఏర్పాట్లను పోలీసు, ట్రాఫిక్ ఉన్నతాధికారులతో నేతలు సమీక్షించారు. పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, అభిమానులు రానున్న నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో 16 స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యమంటూ ఇటీ వలే మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అనుసరించిన వ్యూహం రాజకీయ వర్గాల్లో ప్రధాన్యత పెంచింది.