చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్ జారీ

-

ఎనిమిదేళ్ల తర్వాత తెరపైకి వచ్చిన బాబ్లీ కేసు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ని జారీ చేసింది. 2010 నాటి ఈ కేసును ధర్మాబాద్ మెజిస్ట్రేట్ కోర్టు మళ్లీ తెరపైకి తెచ్చింది. సీఎం చంద్రబాబు తో పాటు మరో 15 మందికి ఈ నోటీసులు, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ నెల 21 లోగా చంద్రబాబుతో పాటు మిగతా వారందరూ హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. నాడు బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. ప్రతిపక్ష నేతగా ఉన్న బాబు తనతో పాటు 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి తెలంగాణ సరిహద్దు దాటి మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు వద్దకు వెళ్లేందుకు యత్నించారు. దీంతో చంద్రబాబుతో సహా ఎమ్మెల్యేలను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. అయితే అప్పటి నుంచి పెండింగ్ లో ఉన్న ఈ కేసుని మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి ధర్మాబాద్ కోర్టులో పిటీషన్ వేయడంతో మళ్లీ తెరపైకి వచ్చింది. దాదాపు 8ఏళ్ల తర్వాత ఈ కేసుకు సంబంధించి నోటీసులు జారీ అవ్వడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది.

నోటీసులు అందిన వారిలో నారా చంద్రబాబు నాయుడు, దేవినేని ఉమా మహేశ్వరరావు, నక్కా ఆనంద బాబు, టి.ప్రకాశ్ గౌడ్, జి.కమలాకర్, సి.హెచ్. ప్రభాకర్, ఎన్.నాగేశ్వర్, జి.రామానాయుడు,  కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, సి.హెచ్. విజయరామారావు, ముజఫరుద్దీన్, అన్వరుద్దీన్, హన్మంత్ షిండే, పి. అబ్దుల్ ఖాన్ రసూల్ ఖాన్, ఏఎస్.రత్నం, పి. సత్యనారాయణ శింభు, ఎస్. సోమోజు లు ఉన్నట్లు తెలుస్తోంది.

కొద్ది రోజుల క్రితమే చంద్రబాబుకు నోటీసులు వస్తాయని పలువురు పేర్కొంటున్న సందర్భంలో గురువారం నోటీసులు అందడం చర్చనీయాంశమైంది.

Read more RELATED
Recommended to you

Latest news