టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ టీడీపీ ఆఫీసులో సమావేశం అయింది. కలసి పోటీ చేయబోతున్నందున ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజల ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించాయి. ఇప్పటికే టీడీపీ తమ పార్టీ మహానాడులో మినీ మేనిఫెస్టోన ప్రకటించారు. ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు జనసేన పార్టీ కూడా కలిసినందున ఆ పార్టీ ఆలోచనలు కూడా తీసుకుని ఉమ్మడి మేనిఫెస్టోపై దృష్టి సారించాయి. ఉమ్మడి మేనిఫెస్టో కమిటీకి సంబంధించి రెండు పార్టీల నుంచి కమిటీలను నియమించారు. ఈ కమిటీలు టీడీపీ ఆఫీసులో సమావేశం అయ్యాయి. ”ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై ప్రాథమికంగా చర్చించాం. రాష్ట్రంలో సమస్యలు చాలా ఉన్నాయి. వివిధ వర్గాలకు ఇప్పటివరకు లేని సమస్యలను జగన్ సృష్టించారు. ఈ సమస్యలను పరిష్కరించే అంశాలతో ఉమ్మడి మేనిఫెస్టో రూపొందిస్తాం. తుది మేనిఫెస్టో విడుదల చేసే ముందు వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులతో చర్చిస్తాం. ఈ మీటింగ్ విశేషాలను పార్టీ అధినాయకత్వాల దృష్టికి తీసుకెళ్తాం. సౌభాగ్యపదం పేరుతో యువత వ్యాపారాలు చేసుకునేందుకు ఆర్థిక సాయం అందించే అంశాన్ని జనసేన ప్రతిపాదించింది.
సంపన్న ఆంధ్రప్రదేశ్ పేరుతో రాష్ట్రాభివృద్ధికి పెద్ద పీట వేసేలా ప్రణాళికలు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లులా ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన చేస్తాం. అసమానతలు తొలిగి ఆర్ధిక వ్యవస్థ బాగుపడేలా ప్రణాళికలు చేస్తున్నాం” అని యనమల రామకృష్ణుడు వెల్లడించారు. ”జనసేన వైపు నుంచి ఆరు ప్రతిపాదనలు పెట్టాం. యువతకు, మహిళలకు పవన్ కొన్ని హామీలిచ్చారు. అలాగే వివిధ వర్గాలకు వారాహి యాత్రలో పవన్ హామీలిచ్చారు. మేం ప్రతిపాదించిన కొన్ని అంశాలు టీడీపీ ప్రతిపాదించిన అంశాల్లోనూ ఉన్నాయి” అని ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ సభ్యుడు ముత్తా శశిధర్ తెలిపారు.