ట్రాఫిక్ పోలీసుల‌పై చింత‌మ‌నేని అనుచ‌రుల హ‌ల్‌చ‌ల్‌

-


విజయవాడ: విజయవాడ నగరంలోని బందరు లాకుల వద్ద గురువారం రాత్రి ఇద్దరు యువకులు ఓ పోలీసు కానిస్టేబుల్‌పై వీరంగం సృష్టించారు. ట్రాఫిక్ సిగ్నల్‌ దాటి వేగంగా ముందుకెళ్తున్న ఏపీ16 సీఎం 2244 నంబరు గల కారును కానిస్టేబుల్‌ అనిల్‌కుమార్‌ ఆపి పక్కన పెట్టాలని ఆదేశించడంతో వారు దుర్భాషలాడుతూ ఘర్షణకు దిగారు. దీంతో ఆగ్రహించిన కానిస్టేబుల్‌ కారును పోలీస్‌స్టేషన్‌కు తరలించాలని చెప్పడంతో చేయి చేసుకున్నారు. తాము దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని అనుచరులమని చెప్పుకుంటూ వారిద్దరూ వీరంగం సృష్టించడం నగరంలో చర్చనీయాంశమైంది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కారును గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ట్రాఫిక్ కానిస్టేబుల్‌ అనిల్‌కుమార్‌ ఫిర్యాదు ఆధారంగా వారిపై గవర్నర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు.

వారితో నాకు సంబంధం లేదు: చింతమనేని
తన అనుచరులని చెప్పుకుంటూ కానిస్టేబుల్‌పై దాడి చేసిన వారితో తనకెలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ తేల్చిచెప్పారు. తన పేరు వాడుకుని అరాచకాలు సృష్టించే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇకమీదట తన పేరు వాడుకొని ఎవరైనా దాడులు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చింతమనేని ప్రభుత్వానికి సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news