జాబిల్లి ఉపరితలంపై చంద్రయాన్-3 ప్రస్థానం కొనసాగుతోంది. అయితే, చంద్రుడి దక్షిణ ధ్రువానికి సంబంధించి ఇంతవరకు ఎవరికీ తెలియని సమాచారాన్ని సేకరిస్తున్న ప్రజ్ఞాన్ రోవర్ ఓ ప్రమాదాన్ని అధిగమించింది. అధ్యయనంలో భాగంగా కదులుతున్న రోవర్.. చంద్రుని ఉపరితలంపై ఓ బిలానికి (గొయ్యి) అతి సమీపంలోకి వెళ్లింది. ప్రజ్ఞాన్ రోవర్ స్థానానికి దాదాపు 3 మీటర్లు దూరంలో 4 మీటర్ల వ్యాసం గల గొయ్యికి అతీ సమీపంలోకి వెళ్లినట్లు సోమవారం ఇస్రో ప్రకటించింది.
అయితే సెన్సార్ అలర్ట్ తో రోవర్ తిరిగి యథాస్థానానికి వచ్చిందని తెలిపింది.దీనికి సంబంధించిన ఫొటోలను ISRO X(గతంలో ట్విట్టర్)లో పంచుకుంది. “ఆగస్టు 27, 2023న, రోవర్ దాని స్థానానికి 3 మీటర్ల దూరంలో ఉన్న 4 మీటర్ల వ్యాసం కలిగిన బిలం వద్దకు వచ్చింది. మార్గాన్ని తిరిగి పొందాలని రోవర్‌కు ఆదేశించబడింది. ఇది ఇప్పుడు సురక్షితంగా కొత్త మార్గంలో పయనిస్తోంది.” అని ఇస్రో తెలిపింది