బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కి హైకోర్టు లో భారీ ఊరట లభించింది. సోమవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. బొంరాస్ పేట పీఎస్ లో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చింది. లగచర్ల ఘటనలో ఇప్పటికే బెయిల్ పై బయటకు వచ్చిన నరేందర్ రెడ్డి పై లగచర్ల ఘటనకు ముందే బొంరాస్ పేటలో ఆయనపై మరో కేసు నమోదయింది. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా బెయిల్ ఇవ్వాలని నరేందర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ మంజూరు చేయడంతో పాటు విచారణకు సహకరించాలని పట్నం నరేందర్ రెడ్డిని హైకోర్టు ఆదేశించింది.
ఇది ఇలా ఉండగా.. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్లలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ గ్రామానికి వచ్చారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. కలెక్టర్ పై దాడికి దిగేలా ప్రజలను రెచ్చగొట్టిన వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు సురేష్ అని పోలీసులు స్పష్టం చేశారు. సురేష్ ఎక్కువ సార్లు పట్నం నరేందర్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడటంతో ప్రధాన సూత్రదారుడు పట్నం నరేందర్ రెడ్డి అని పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.