తహశీల్దార్ వనజాక్షి ఉదంతాన్ని మరిచిపోండి. ఎందుకంటే పాపం ఆమె ఆడబిడ్డ. తెగించి ఊరి కాని ఊరికి వెళ్లి దెబ్బలు తిని వచ్చారు. అయినా కూడా ఆ విషయం మరిచిపోండి. ఎందుకంటే అది టీడీపీ హయాంలో జరిగింది కనుక ! ఇప్పుడు తాజాగా జరిగింది వైసీపీ హయాంలో..! పశ్చిమ గోదావరి వాకిట ఆ రోజు జరిగితే ఇవాళ కృష్ణా తీరంలో జరిగింది అంతే తేడా ! మిగతా సీన్ సేమ్ టు సేమ్. అయినా కూడా మేం అధికారులను వారి పనిని వారు యథేచ్ఛగా స్వేచ్ఛగా చేసుకునే వీలు కల్పిస్తాం అని జగన్ చెప్పినా అవి అమలు కావు. అలా అని ఆయన వీటిని ప్రోత్సహిస్తున్నారని కాదు కానీ నిలువరించలేకపోవడం కూడా ఓ సీఎం వైఫల్యమే !
రెవెన్యూ ఇన్స్పెక్టర్ అక్కడకు వెళ్లింది తహశీల్దార్ సమాచారం మేరకే ! నిబంధనలు విరుద్ధంగా మట్టి తవ్వకాలు ఆ రోజు టీడీపీ కూడా చేసింది. ఇప్పుడు వైసీపీ చేస్తోంది.. అని అంటున్నాయి కమ్యూనిస్టు పార్టీలు. ఎవరు ఎలా ఉన్నా ఎవరు ఏం అనుకున్నా ఆ రెండు పార్టీలు తప్పిదాలు చేస్తూనే ఉన్నాయని కమ్యూనిస్టు పార్టీలు గగ్గోలు పెడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం ఏంటి ?
మంత్రి హోదాలో ఉన్నప్పుడు ఎన్నో వివాదాలను నెత్తిన వేసుకుని తిరిగారు కొడాలి నాని. పౌర సరఫరాల శాఖలో జరిగిన అవినీతిని అస్సలు ఆయన నిలువరించలేకపోయారు అన్న అభియోగాలూ విపక్షం నుంచి వచ్చాయి. అదే విధంగా పేదలకు అందించే బియ్యం నిబంధనలకు విరుద్ధంగా దేశం దాటి పోయాయి అన్న వార్తలూ వచ్చాయి. వీటికి కూడా ఆ రోజు ఆయన
సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. అదేవిధంగా సంబంధిత అక్రమార్కులను నిలువరించలేకపోయారు. తాజాగా ఆయన మనుషులు గుడివాడ కేంద్రంగా రెచ్చిపోయారు. విధుల్లో ఉన్న అధికారిపై భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఇక్కడ ఎవ్వరూ వీడియో రికార్డు చేయకండి …లైట్లు ఆపి మరీ కొట్టండి అని అక్కడున్న వారు అంటున్న మాటలు విని విస్తుబోవడమే మన వంతు !
ఏదో ఒక విధంగా చింతమనేని తగాదాను ఆ రోజు ఎన్జీఓ సంఘ నేతలు తీర్చారు. ఇప్పుడు కొడాలి నాని మనుషులు ఆర్ ఐ కు క్షమాపణలు చెబుతారా? లేదా గొడవను పెద్దది చేస్తారా ? ఇంతకూ విధుల్లో ఉన్న వారు అక్రమాలనో అన్యాయాలనో అడ్డుకోవాలా వద్దా ? వీటిపై కూడా వైసీపీ పెద్దలు ఓ క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందే ! పత్రికల్లో వచ్చే కథనాలను చూపిస్తూ అధికారిక కార్యక్రమాల్లో
మాట్లాడుతున్న సీఎం..తన హయాంలో అధికారులకు ప్రాణ రక్షణ లేకుండా పోతుందన్న విషయాన్ని గుర్తించాలని విపక్షం హితోపదేశం చేస్తోంది.