ఏ క్షణం మృత్యువు ఎవరిని ఎక్కడ కాటువేస్తుందో అంచనా వేయడం కష్టం.. ఒకప్పుడు చావుకు భయపడే వారు కానీ ఇప్పుడు బ్రతకాలంటే భయపడే రోజులు సమాజంలో నెలకొంటున్నాయి.. ఎక్కువగా ఇతరుల నిర్లక్ష్యం వల్లే జరుగుతున్న రోడ్దుప్రమాదాల్లో మరణించడం లేదా అంగవైకల్యం పొందడం ఏదో ఒకటి జరుగుతుంది.. కానీ దీని వల్ల ఎన్ని కుటుంబాలు అనాధలా మారుతున్నాయో, ఎంత మంది తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా మిగులుతున్నారో లెక్క కట్టడం కష్టం.. ఇక తప్పు ఎవరు చేసిన దాని ఫలితం ఇరు కుటుంబాల పై పడుతుంది..
ఇకపోతే కృష్ణా జిల్లాలో బుధవారం చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో పది మంది మరణించిన ఘటన స్దానికులను కలచివేసింది.. ఆ వివరాలు చూస్తే.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం గోపవరం గ్రామానికి చెందిన దాదాపు 25 మంది. మంగళవారం ట్రాక్టర్‌లో వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి దైవదర్శనానికి వెళ్లారు. రాత్రి ఆలయంలోనే బస చేసి, బుధవారం ఉదయం మొక్కులు చెల్లించుకొని ఇంటికి బయలుదేరి వస్తున్న క్రమంలో జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను మృత్యుశకటంలా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టింది.
ఇక ఈ ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను పోలిసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.