తెలంగాణలో పదోతరగతి పాస్ అయిన విద్యార్థులు ఇప్పటికే కొంత మంది సోషల్ వెల్పేర్, ట్రైబల్ వెల్పేర్, బీసీ వెల్పేర్, మైనార్టీ వంటి గురుకులాలలో జాయిన్ అవుతున్న విషయం తెలిసిందే. పదోతరగతి ఫెయిల్ విద్యార్థులకు రేపటి నుంచి సప్లమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి. జూన్ 3వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అంటే మూడు గంటలు పరీక్ష జరగనుంది. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు 51,237 మంది విద్యార్థులు హాజరు కానున్నారు.
ఇందులో 31,625 మంది అబ్బాయిలు, 19,612 మంది అమ్మాయిలు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 170 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 170 మంది చీఫ్ సూపరింటెండ్, 170 మంది డిపార్ట్ మెంటల్ ఆఫీసర్లు, 1300 మంది ఇన్విజిలేటర్లు విధుల్లో ఉండనున్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్ కూడా ఇప్పటికే విడుదల చేశారు. విద్యార్థులు, ఇన్విజిలేటర్లు పరీక్షా కేంద్రాల్లోకి ఫోన్లు తీసుకుని రాకూడదు. విద్యార్థులు నిర్ణీత సమయంలో పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని సూచించారు.