వరదలో కొట్టుకుపోయిన 14 కార్లు.. తృటిలో తప్పిన ముప్పు!

మధ్యప్రదేశ్‌లో తృటిలో ప్రమాదం తప్పింది. ఖర్గోన్ జిల్లాలోని సుక్ది నదిలో ఒక్కసారిగా వరదలు పోటెత్తడంతో 14 కారులు కొట్టుకుపోయాయి. దీంతో అప్రమత్తమైన స్థానికులు ప్రయాణీకులను కాపాడారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాల ప్రకారం.. సుక్ది నదికి సమీపంలో కట్యూట్ అడవి ఉంది. కొన్ని కుటుంబాలకు విహార యాత్రకు బయల్దేరారు. నది దాటుతున్న క్రమంలో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది.

వరద-కార్లు-ముప్పు
వరద-కార్లు-ముప్పు

దీంతో దాదాపు 14 కార్లు వరదలో చిక్కుకున్నాయి. అది గమనించిన స్థానికులు కారులో ప్రయాణిస్తున్న వారిని సురక్షితంగా కాపాడారు. ఈ మేరకు ఘటనా స్థలానికి రెస్క్యూ టీమ్ చేరుకుంది. 50 మందిని సురక్షితంగా కాపాడినట్లు పోలీసులు తెలిపారు. అలాగే ట్రాక్టర్ల సాయంతో 10 కార్లను బయటికి తీశారు. మిగిలిన కార్లల్లో నీరు నిండటం వల్ల బయటికి తీయలేకపోయినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం బాధితులను సురక్షితంగా తమ తమ కుటుంబాలకు తరలించినట్లు అడిషనల్ ఎస్పీ జితేందర్ సింగ్ పవార్ తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.