కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను కేంద్ర ప్రభుత్వం సోషల్ డిస్టన్స్ నిబంధనలను అమలులోకి తెచ్చిన విషయం విదితమే. ప్రధాని మోదీ మొదటి లాక్‌డౌన్ నుంచి ఇప్పటి వరకు సామాజిక దూరం పాటించాలని చెబుతూ వస్తున్నారు. ఇక అనేక దేశాల్లో సోషల్ డిస్టన్స్‌ను పాటిస్తున్నారు. అయితే సోషల్ డిస్టన్స్ నిబంధన పెట్టకపోయి ఉంటే.. 46 దేశాల్లో మార్చి, ఏప్రిల్ నెలల్లోనే 15 లక్షల కేసులు ఎక్కువగా నమోదు అయి ఉండేవని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది.
యూటీస్ ఎండీ ఆండర్సన్ పరిశోధకులు 46 దేశాల్లో కరోనా వ్యాప్తిపై అధ్యయనం చేపట్టారు. ఈ క్రమంలోనే వారు పై విషయాన్ని వెల్లడించారు. సోషల్ డిస్టన్స్ నిబంధనను అమలుచేయకపోయి ఉంటే కరోనా వ్యాప్తి మరీ తీవ్రతరంగా ఉండేదని, పెద్ద సంఖ్యలో జనాలకు కరోనా సోకేదని అన్నారు. ఆయా దేశాలు ముందు జాగ్రత్త చర్యగా సోషల్ డిస్టన్స్‌ను అమలు చేయబట్టే కరోనా వ్యాప్తి తక్కువగా ఉందన్నారు. అయినప్పటికీ ప్రస్తుతం కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుందన్నారు.
కాగా సామాజిక దూరం నిబంధన కింద వ్యక్తికి వ్యక్తికి కనీస దూరం 6 అడుగులు ఉండాలని నిర్ణయించారు. అయితే ఇప్పటికే అనేక చోట్ల జనాలు సామాజిక దూరం నిబంధనను పాటించడం లేదు. పైగా కొందరైతే మాస్కులు లేకుండానే బయట తిరుగుతున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకూడదని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.