ఆంధ్రప్రదేశ్ లో పేరుకు మూడు రాజధానులు అంటున్నా.. హైకోర్టు ఉన్నంత మాత్రాన కర్నూలు రాజధాని కాదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అదేమంటే… కేరళ హైకోర్టు కోచ్చిలో, యుపి హైకోర్టు అలహాబాద్‌లో, ఒరిస్సా హైకోర్టు కటక్ లో వుంటే వాటిని రాజధానులు అనడం లేదనేది వారి వాదన! అయితే అక్కడ రాజధాని ఏర్పాటును ఎవరూ కాదనడం లేదు గానీ సుప్రీం కోర్టు ఆమోదం రావడానికి సమయం పట్టొచ్చు అంట! ఈలోగా ట్రైబ్లునల్స్ ఏర్పాటు జరగొచ్చు.
అదేవిధంగా.. ఏడాదిలో కొద్ది రోజులు శాసనసభ జరిగే అమరావతి కూడా శాసనరాజధానిగా పేరు మాత్రమే నిలుపుకొంటుంది. జగన్ పాలనా కేంద్రంగా విశాఖ వుండబోతుందని గ్రేహౌండ్స్ ఆవరణలో సీఎం క్యాంపు కార్యాలయం ఉంటుందని దాదాపు రూఢీగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే తెలిసిపోతుంది. అక్కడి నుంచి మధురవాడ, తగరపు వలస, బోగాపురం భీమునిపట్నం వరకూ వివిధచోట్ల శాఖ కార్యాలయాలను ఏర్పాటు చేస్తారని కూడా టాక్ నడుస్తోంది. కాగా భోగాపురం విమానాశ్రయం కట్టి విశాఖలో నౌకాదళ విమానాశ్రయం వారికే అప్పగిస్తారని కూడా సమాచారం అందుతుంది.
కాగా ఇవన్నీ వైజాగ్ రాజధానిగా మార్పును అనుసరించి తీసుకుంటున్న చర్యలుగా చెప్పవచ్చు. అమరావతి భూమిలో ఒకప్పటి సీడ్ క్యాపిటల్ లో 1600 ఎకరాలు అమ్మకానికి పెట్టారనుకుంటున్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అమరావతి మెట్రోపాలిటన్ సిటీ అంటున్నప్పటికీ… రాజధాని తరలిపోయాక అంత సీను అక్కడ ఉండదనే విషయం కూడా స్పష్టమౌతున్న విషయం!
కాగా దాదాపు 40 వేల ఎకరాల మేరకు ప్రభుత్వం చేతిలో ఉన్న భూమినీ, అక్కడ కట్టడాలకు ఉపయోగించుకొని ఒక హబ్‌గా పెంచే ప్రణాళిక అమలు చేయవచ్చు అనేది కూడా తెలుస్తున్న సత్యం. అయితే అమరావతిలో ప్రజల చిన్నాభిన్నమైన జీవితాలనూ, వ్యవసాయాన్ని పల్లెలనూ ఏం చేయబోతున్నారన్నది ప్రశ్నగానే మిగిలి ఉంటుంది.
అయితే ఇక్కడ విపరీతంగా వినవచ్చే విషయం ఏమిటంటే… వెనక్కు తిరిగి తీసుకుంటామంటే ఇచ్చేస్తామని గతంలో ప్రభుత్వం స్పష్టం చేసింది. సీఆర్‌డీఏ రద్దు జరిగిన తర్వాత అక్కడ ప్రజల కదలిక ఎలా ఉంటుందనే దానిపై ప్రభుత్వ స్పందన ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ… ఈ ఒడుదుడుకులలో స్థానిక రైతు ఇతరులు ప్రమేయంలేదు కాబట్టి వారికి పూర్తి న్యాయం చేయడం ప్రభుత్వం బాధ్యతగా చెప్పవచ్చు. ఇదే విషయాన్ని అన్ని పార్టీలు మూకుమ్మడిగా చెప్తున్నాయి. ఇప్పుడు అన్ని పార్టీల ముందున్న మార్గం ఏమిటంటే.. జగన్ ప్రభుత్వం అందుకు తగినట్టు స్పందించేలా ఒత్తిడి తీసుకురావడంతో పాటు… విశాఖ అసలు రాజధానిగా అంగీకరించడం అని పలువురు అభిప్రాయపడుతున్నారు!!