ప్రేమ,అనుబంధాలు,ఆప్యాయతలు అనేవి ఒకప్పుడు బంధాల మధ్య ఉండేవి. కానీ ఇప్పుడు బంధాలు అంటే పగ,కక్షలు,కార్పణ్యాల తో నిండిపోయి ఉంటున్నాయి. ఏమాత్రం అనుబంధాలను లెక్క చేయకుండా పగ,ప్రతీకారం వంటి పదాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు పంచుకుంటున్నారు కానీ, ప్రేమలను పంచుకోవడంలేదు. ఆస్తిపాస్తుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. అలాంటి ఓ ఇద్దరు అన్నదమ్ములు ఆస్తికోసం ఒకరినొకరు తుపాకీతో కాల్చుకుని చనిపోయిన ఘటన ఢిల్లీ లోని సివిల్ లైన్స్ లో చోటుచేసుకుంది. ఆస్తుల పంపకం విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ మొదలవ్వడం తో అది చివరికి చిలికి చిలికి గాలివానలా మారడం తో ఒకరినొకరు కాల్పులు జరుపుకొనే స్థాయికి తీసుకువచ్చింది. దీంతో విచక్షణ కోల్పోయిన అన్న తొలుత తుపాకీ తీసి తమ్ముడిపై కాల్పులు జరిపాడు. దానితో తమ్ముడు కూడా అన్నపై సినీఫక్కీలో ఎదురు కాల్పులు జరిపడం తో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.
తీవ్ర గాయాలతో బయటకు వచ్చిన అన్న.. అక్కడే కుప్పకూలి మృతిచెందాడు. అంతటితో వదలని తమ్ముడు ఇంటి నుంచి బయటకు పరుగెత్తుకుని వచ్చి కిందపడిపోయిన అన్నపై మరోసారి కాల్పులు జరిపడం తో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం ఇంటికి కొద్ది దూరంలో తమ్ముడు కూడా కుప్పకూలి మృతి చెందినట్లు తెలుస్తుంది. అయితే ఈ ఘటనలో మృతి చెందిన అన్నదమ్ములు రాహల్ నాగర్, తనూజ్ నాగర్ గా గుర్తించారు. అయితే అన్నదమ్ములు ఇద్దరూ కూడా మరణించడం తో వారి కుటుంబం లో తీరని విషాదం అలుముకుంది.