తమ దేశంలో కరోనా లేదని, కేసులు సున్నా అయ్యాయని ఇటీవలే ఆ దేశ ప్రధాని జసిండా ఆర్డర్న్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అంతా సద్దుమణిగిందని అనుకుంటున్న లోపే అక్కడ కొత్తగా మరో 2 కరోనా కేసులు వచ్చాయి. దీంతో అధికారులు, ప్రభుత్వం అలర్ట్ అయ్యారు. గత 24 రోజుల నుంచి అక్కడ కొత్తగా కరోనా కేసులు నమోదు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ కొత్తగా 2 కేసులు రావడంతో జనాలు మళ్లీ ఆందోళనకు గురవుతున్నారు.
జూన్ 7వ తేదీన యూకే నుంచి దోహా, బ్రిస్బేన్ మీదుగా వెల్లింగ్టన్‌కు వచ్చిన ఇద్దరు మహిళలకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. వెల్లింగ్టన్‌లో ఉన్న తమ బంధువు ఒకరికి సీరియస్‌గా ఉండడంతో వారిద్దరిని అక్కడికి వచ్చేందుకు న్యూజిలాండ్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అయితే వారు రాగానే వారికి కరోనా పరీక్షలు చేశారు. ఈ క్రమంలో ఆ ఇద్దరు మహిళలకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వారిని ఐసొలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా కొత్తగా వచ్చిన రెండు కేసులతో అక్కడ మొత్తం కరోనా కేసుల సంఖ్య 1506కు చేరుకుంది. మొత్తం అక్కడ 22 మంది వరకు చనిపోయారు.