మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో కరోనా, ఓమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా ఈ రోజు కూడా ముంబై మహా నగరంలో 20,318 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అంతే కాకుండా ఈ రోజు ముంబై నగరంలో కరోనా కాటుకు 5గురు మరణించారు. అలాగే ఈ రోజు కేవలం 6,003 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అలాగే ప్రస్తుతం ముంబై మహా నగరంలో 1,06,037 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే ముంబై మహా నగరంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ టోపీ కీలక వ్యాఖ్యలు చేశారు.
కరోనాతో పాటు ఓమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయని అన్నారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటించక పోతే.. లాక్ డౌన్ ప్రకటించక తప్పదని హెచ్చరించారు. లాక్ డౌన్ విధిస్తే ప్రజలు మళ్లీ ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. లాక్ డౌన్ నుంచి తప్పించుకోవాలంటే.. ప్రజలు తప్పని సరిగా కరోనా నిబంధనలను పాటించాలని సూచించారు.