చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇటీవలే మరో 118 చైనా యాప్ లను నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే వాటిలో పబ్‌జి గేమ్ కూడా ఉంది. కాగా ఈ గేమ్‌ను బ్యాన్ చేసినందుకు గాను దాన్ని ఆడలేకపోతున్నానని చెప్పి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లా చక్ దహా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పుర్బా లాల్ పూర్ అనే ప్రాంతంలో నివాసం ఉండే ప్రీతమ్ హాల్దర్ (21) అనే ఐటీఐ విద్యార్థి పబ్‌జి గేమ్‌ను విపరీతంగా ఆడేవాడు. అర్థరాత్రి చాలా సేపు గేమ్ ఆడుతూ గడిపేవాడు. కాగా ఇటీవల భారత ప్రభుత్వం ఈ గేమ్‌ను బ్యాన్ చేసింది. దీంతో పబ్‌జి ఆడలేకపోతున్నానని చెప్పి అతను తన బెడ్‌రూంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కాగా అతను అర్థరాత్రి వరకు పబ్‌జి గేమ్ ఆడుతూ ఉండేవాడని.. అందువల్లే అతను సూసైడ్ చేసుకున్నాడని అతని తల్లి పోలీసులకు తెలిపింది. అయితే మద్యపానం, ధూమపానం లాగే కొందరికి పబ్‌జి అనేది వ్యసనంగా మారింది. ఈ క్రమంలో ఆ గేమ్‌ను నిషేధించడంతో దాన్ని ఆడేవారు తీవ్రమైన మానసిక వేదనకు లోనయ్యే అవకాశం ఉంటుందని సైకియాట్రిస్టులు హెచ్చరిస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏం చేస్తుందో చూడాలి.