అయోధ్యలో రామందిర నిర్మాణం కోట్లాది హిందువుల స్వప్నం.అందుకే రామాలయం కోసం ఏకంగా 2100కిలోల గంటను తయారు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ ఎటా జిల్లా జలేసర్‌కు చెందిన కళాకారులు. నాలుగు నెలల పాటు శ్రమించి దీనిని రూపొందించారు. కేవలం ఇత్తడితో కాకుండా అష్టదాతులోని 8 లోహాలతో ప్రత్యేకంగా దీన్ని తీర్చిదిద్దారు. గంట తయారీకి రూపొందించిన అచ్చులో కరిగిన లోహాన్ని నిపేందుకు ఓ క్రేన్ నే ఉపయోగించారు. మొత్తానికి అనుకున్న పని పూర్తి చేసి దేశంలోనే అతిపెద్ద గంటను సిద్ధం చేశారు.
ఈ గంట తయారీలో మరో విశేషం ఏమిటంటే దీని నమూనా రూపొందించింది ఓ ముస్లిం. ఆయన పేరు ఇక్బాల్ మిస్త్రీ. ఈ వృత్తిలో 30 ఏళ్ల అనుభవం ఉన్న దౌ దయాల్ ఆధ్వర్యంలో 25 మంది కళాకారుల బృందం రోజుకు 8 గంటలపాటు శ్రమించి దీన్ని పూర్తి చేసింది.తాము ఇప్పటివరకు ఇంత భారీ గంటను చూడలేదని వారు చెప్పారు. చారిత్రక రామమందిరం కోసం దీన్ని తయారు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.దేశంలోనే అతిపెద్ద గంటను రామమందిరానికి విరాళంగా ఇస్తామని చెప్పారు జలేసర్ మున్సిపల్ కౌన్సిల్ ఛైర్మన్ వికాస్ మిత్తల్. ఈ గంటను తయారు చేసిన కర్మాగారానికి ఈయనే యజమాని.అయోధ్యలో రామ మందిరం కోసం న్యాయపోరాటం చేసిన నిర్మోహి అఖాడా.. గతేడాది నవంబరులో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు అనంతరం 2100 కిలోల గంటను సిద్ధం చేయమని మిత్తల్‌కు ఆర్డర్ ఇచ్చింది.