కరోనా వైరస్ ఎంతో మందిని బలి తీసుకుంటోంది. కన్నవారిని, కుటుంబ సభ్యులను, స్నేహితులను దూరం చేస్తోంది. కనీసం కడసారి చూపుకు కూడా నోచుకోనీయడం లేదు. తాజాగా కరోనా మహమ్మారి ఒకే ఇంట్లో ముగ్గుర్ని పొట్టనపెట్టుకుంది. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం దుబ్బచర్ల గ్రామానికి చెందిన ఆన్‌రెడ్డి సత్యనారాయణ రెడ్డి (60), అతని భార్య సుకుమారి (55), కుమారుడితో కలిసి చంపాపేట ఆర్‌టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. సత్యనారాయణ రెడ్డి సోదరుడి కుమారుడు అన్‌రెడ్డి హరీష్ రెడ్డి (37) న్యాయవాది. ఇతను కూడా తన భార్య పిల్లలతో కలిసి అదే డివిజన్‌లోని రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నాడు. కాగా భూవివాదానికి సంబంధించి వీరందరూ ఒకే కారులో ఇటీవల స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అయితే తరువాత 3 రోజులకు న్యాయవాది హరీష్‌రెడ్డి తనకు శ్వాస సరిగ్గా ఆడడం లేదని చెప్పగా.. అతనికి కరోనా పరీక్షలు చేశారు. దీంతో పాజిటివ్ వచ్చింది.
హరీష్‌రెడ్డితోపాటు అతని భార్య, 5 ఏళ్ల కుమార్తెకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక సత్యనారాయణ రెడ్డి, ఆయన భార్య సుకుమారి, వారి 21 ఏళ్ల కుమారుడికి కూడా కరోనా సోకినట్లు నిర్దారణ అయింది. కాగా హరీష్‌రెడ్డిని సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్‌కు తరలించగా.. వారు ఇన్సూరెన్స్‌పై చికిత్స అందించేందుకు అంగీకరించలేదు. దీంతో హరీష్‌ను బంజారాహిల్స్‌లోని విరించి హాస్పిటల్‌లో చేర్చారు. ఈ క్రమంలో హరీష్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ జూలై 23న చనిపోయాడు. చికిత్సకు గాను రూ.16 లక్షల వరకు చెల్లించినా.. హరీష్ బతకలేదు.
ఇక సత్యనారాయణ రెడ్డి, సుకుమారిలు జూలై 10న సోమాజిగూడలోని డెక్కన్ హాస్పిటల్‌లో కోవిడ్ చికిత్సకు అడ్మిట్ అయ్యారు. తరువాత 2 రోజులకు డిశ్చార్జి అయి హోం ఐసొలేషన్ చికిత్స తీసుకోవడం మొదలు పెట్టారు. కానీ రెండు రోజులకే సత్యనారాయణ రెడ్డి తీవ్ర ఆయాసం, జ్వరంతో బాధపడగా అతన్ని జూలై 15న మళ్లీ డెక్కన్ హాస్పిటల్‌కు తరలించారు. ఇక సుకుమారికి కూడా శ్వాస సమస్యలు రావడంతో ఆమెను కూడా అదే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కానీ అక్కడ పడకలు లేవని చెప్పడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో చేర్చారు. అయినా ఆమెకు మెదడులో రక్తం గడ్డకట్టి జూలై 28న చనిపోయింది. ఇక డెక్కన్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్న సత్యనారాయణ రెడ్డి అదే రోజు రాత్రి చనిపోయాడు. దీంతో వారం వ్యవధిలోనే ముగ్గురు చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
కాగా సత్యనారాయణ రెడ్డి, సుకుమారిల కుమారుడు రాజేష్ రెడ్డికి కూడా కరోనా వచ్చింది. దీంతో అతను చికిత్స తీసుకుంటున్నాడు. అయితే తన అమ్మ, నాన్నలకు చికిత్స అందించిన హాస్పిటళ్లు అతనికి రూ.17.50 లక్షల బిల్లు వేశారు. అందులో అతను రూ.8 లక్షలు చెల్లించాడు. అయినా మొత్తం చెల్లిస్తేనే మృతదేహాలను అప్పగిస్తామనడంతో అతను మీడియాను ఆశ్రయించాడు. దీంతో వారు మృతదేహాలను అప్పగించారు. కరోనాతో ఓ వైపు జనాలు చనిపోతుంటే.. మరోవైపు ప్రైవేటు హాస్పిటళ్ల ధన దాహానికి మాత్రం అడ్డూ, అదుపూ లేకుండా పోయింది.