ఆకాశంలో తరచూ ఏదో ఒక అద్భుతం జరుగుతూ ఉంటోంది. ఎన్నో ఏళ్ల కిందట జరిగిన అద్భుత సంఘటనలు మరోసారి అదే తేదీన జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు భూమిపై ఉన్న జీవులకు వాటిలో కొన్నింటినే చూసే అవకాశం ఉంటుంది. అలాంటి అద్భుతమే ఈ రోజు ఆకాశంలో కనిపించడబోతోంది. సోమవారం రాత్రి గురు, శని గ్రహాల కలయిక జరగనుంది. భూమిపై నుంచి చూసినప్పుడు అవి ప్రకాశవంతమైన నక్షత్రంలాగా.. ఒకేలా కనిపిస్తాయి. 400 ఏళ్ల తర్వాత చోటు చేసుకుంటున్న ఈ ఘటన చరిత్రలో నిలిచిపోతుందని పరిశోధకులు తెలిపారు.
గురు, శని గ్రహాల కలయిక..
రెండు గ్రహాలు ఆకాశంలో ఒకే చోటకు వచ్చినట్లు కనిపిస్తే దానిని సంయోగం అని అంటారు. అప్పుడు ఆ సమయంలో రెండు గ్రహాలు సాధారణ దూరం కంటే చాలా దగ్గరగా కనిపిస్తాయి. మిగిలిన గ్రహాల కంటే గురు, శని గ్రహాల కలయిక చాలా అరుదుగా కనిపిస్తాయి. పరిభ్రమణ సమయంలో 20 ఏళ్లకు ఒకసారి గ్రహాలు దగ్గరకు వస్తాయని, ఇలా గ్రహాలు కలవడాన్ని సంయోగం అంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రహాలు అత్యంత దగ్గరగా కనిపిస్తే దాన్ని మాత్రం మహా సంయోగం (గ్రేట్ కంజంక్షన్) అని పిలుస్తారన్నారు.
సౌర కుటుంబంలోనే అతి పెద్దదైన గురు గ్రహం సూర్యుడి నుంచి ఐదోవది. రెండో అతిపెద్ద గ్రహం శని.. సూర్యుడి నుంచి ఆరోవది. గురు గ్రహానికి సూర్యుడి చుట్టూ తిరగడానికి 12 ఏళ్లు పడుతుంది. అదే శని గ్రహానికి 30 ఏళ్లు పడుతుంది. ఇలా పరిభ్రమణ సమయంలో ప్రతి 20 ఏళ్లకు ఒకసారి గ్రహాలు దగ్గరగా వచ్చినట్లు కనిపిస్తాయి. రెండు గ్రహాలు దగ్గరకు వచ్చినప్పుడు ఆ సమయంలో భూమి నుంచి చూస్తుంటే.. రెండు గ్రహాలు 0.1 డిగ్రీల మేర మాత్రమే ఎడంగా ఉంటాయని వారు పేర్కొన్నారు. చివరిసారిగా ఇలాంటి సంయోగం 1623 సంవత్సరంలో జరిగింది. తాజాగా రెండు గ్రహాలు దగ్గరికి వచ్చినప్పుడు వీటి మధ్య దూరం 73.5 కోట్ల కిలోమీటర్లు ఉంటుంది. భూమికి గురు గ్రహం 89 కోట్ల కిలో మీటర్లు దూరంలో ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.