దేశ వ్యాప్తంగా రోజు రోజుకీ కోవిడ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న విషయం విదితమే. అనేక రాష్ట్రాల్లో రోజువారీగా నమోదవుతున్న కోవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. ఓ వైపు టీకాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్నప్పటికీ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పాక్షిక లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. అయితే కోవిడ్ కేసులు పెరుగుతుండడం వెనుక 5 ప్రధాన కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
1. కరోనా నేపథ్యంలో గతేడాది చివరి అన్‌లాక్ ప్రక్రియ వరకు ప్రజలు బాగానే జాగ్రత్తలు పాటించారు. అందువల్లే కేసుల సంఖ్య ఒక్కసారిగి తగ్గింది. కానీ ప్రస్తుతం కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ప్రజలు జాగ్రత్తలను పాటించడం లేదు. మాస్కులను ధరించడం లేదు. బహిరంగ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున గుడి గూడుతున్నారు. దీని వల్లే కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుందని చెప్పవచ్చు.
2. కోవిడ్ కేసులు పెరగడానికి గల ఇంకో కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వ ధోరణే అని చెప్పవచ్చు. కోవిడ్ కేసులు తగ్గే సరికి లైట్ తీసుకున్నారు. కోవిడ్ ప్రభావం పూర్తిగా తొలగిపోకముందే అన్ని ఆంక్షలను సడలించారు. ఇది కోవిడ్ వ్యాప్తి చెందడానికి కారణమవుతోంది.
3. కోవిడ్ కేసుల సంఖ్య మెట్రో నగరాల్లో అధికంగా ఉండేది. అయితే సెకండ్ వేవ్ ప్రారంభం అయినా ఈ నగరాల్లో ఆంక్షలను విధించడంలో విఫలం అయ్యారు. సహజంగానే నగరాల్లో జన సాంద్రత అధికంగా ఉంటుంది. అందువల్ల ప్రజలు సాధారణంగానే బయటకు వచ్చి గడుపుతున్నారు. దీంతో కోవిడ్ ఇన్‌ఫెక్షన్ ఎక్కువైంది.
4. కరోనా మొదటి వేవ్ లో వైరస్ వ్యాప్తి చెందేందుకు కొంత సమయం పట్టింది. కానీ ఇప్పుడు ఉత్పరివర్తనం చెందిన వైరస్ కావడంతో ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. ఇది కూడా కోవిడ్ కేసులు పెరగడానికి ఒక కారణంగా చెప్పవచ్చు.
5. గతంలో రోజుకు చేసే కోవిడ్ టెస్టుల సంఖ్యతో పోలిస్తే ఇప్పుడు ఇంకా అధిక మొత్తంలో టెస్టులు చేస్తున్నారు. అందువల్లే ఎక్కువ సంఖ్యలో కేసులు బయట పడుతున్నాయి. అయితే కోవిడ్ కేసులు మళ్లీ భారీగా నమోదవుతుండడంతో ఇప్పుడు ప్రభుత్వాల ముందు లాక్ డౌన్ తప్ప మరో మార్గం కనిపించడం లేదు. మరి ఏం చేస్తారో చూడాలి.