రక్తసిక్తంగా దేవరగట్టు కర్రల సమరం.. 50 మందికి గాయాలు

-

ఏపీలోని కర్నూలు జిల్లాలోని హొళగుంద మండలం దేవరగట్టులో ఏటా నిర్వహించే కర్రల సమరం మరోసారి రక్తసిక్తమయింది. ఈ ఏడాది విజయదశమి రోజున నిర్వహించిన కర్రల సమరంలో 50 మంది గాయాలపాలయ్యారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఏటా దసరా రోజున శ్రీమాళ మల్లేశ్వర స్వామికి నిర్వహించే వేడుకలలో భాగంగా జరిగే ఈ కర్రల సమరం ఈ ఏడాది వర్షం కారణంగా కొంచెం ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ సంవత్సరం నిర్వహించిన కర్రల సమరంలో 50 మంది భక్తులు గాయాలపాలయ్యారు. అంతేకాకుండా ఆ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. చాలాసేపటి వరకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

జిల్లాలోని దేవరగట్టులో మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని జైత్రయాత్రకు ఎంతో ప్రత్యేకత ఉంది. దేవరగట్టులో సుమారు 800 అడుగుల ఎత్తైన కొండపై మాళ మల్లేశ్వరస్వామి ఆలయం ఉంటుంది. దసరా బన్ని ఉత్సవం సందర్భంగా స్వామి మూర్తులను దక్కించుకోవడానికి నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఓ వైపు, అరికెర, అరికెరతండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్‌, విరుపాపురం తదితర గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో తలపడతారు.

Read more RELATED
Recommended to you

Latest news