ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో షిప్ యార్డు ప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ నష్ట పరిహారం ప్రకటించింది. విశాఖలో షిప్ యార్డు యాజమాన్యం, యూనియన్లతో చర్చించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ప్రకటించింది. అలాగే చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని యాజమాన్యం హామీ ఇచ్చినట్టు మంత్రి అవంతి తెలిపారు. కాగా, హిందూస్తాన్ షిప్ యార్డ్ లో దురదృష్టకర సంఘటన గురించి తెల్సిందే. 75 మెట్రిక్ టన్నుల బరువున్న క్రేన్ కుప్పకూలడంతో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలైన విషయం తెల్సిందే. అయితే ఈ సంఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా తక్షణమే స్పందించారు. ప్రమాదం గురించి ఆరా తీసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ నేపధ్యంలో మంత్రి అవంతి శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకొని షిప్ యార్డ్ యాజమాన్యం, కాంట్రాక్ట్ సంస్థలతో సమావేశమయ్యారు. మృతుల కుటుంబాలకు చెల్లించే నష్టపరిహారం, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్న మంత్రి వారితో చర్చల అనంతరం ఆయన ఈ పరిహారాన్ని ప్రకటించారు.