టీటీడీలో కరోనా కలకలం సృష్టించింది. టీటీడీ సిబ్బందిలో ఏకంగా 80 మంది కరోనా బారినపడినట్టు కలెక్టర్ ఎన్.గుప్తా తెలిపారు. ఆలయంలో ప్రతి రోజు 200 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. తాజాగా కరోనా సోకిన సిబ్బందికి భక్తుల ద్వారా వైరస్ సోకినట్టు ఆధారాలు లేవన్నారు. కాగా ఇప్పటి వరకు 800 మంది భక్తులకు కరోనా పరీక్షలు నిర్వహించగా, వారందరికీ నెగటివ్ ఫలితాలు వచ్చినట్టు పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు సిబ్బంది ద్వారా ఏ భక్తుడికి కూడా వైరస్ సోకిన ఆధారాలు బయటకు రాలేదు. కానీ, రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందనేది మాత్రం ఆసక్తిగా మారింది.
వైరస్ బారిన పడిన వారిలో సెక్యూరిటీ సిబ్బంది ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. వైరస్ వ్యాప్తి ఈలాగే కొనసాగితే ఇబ్బందులు తప్పవని శ్రీవారి భక్తులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఉద్యోగుల్లో పాలకమండలి మనోధైర్యం నింపుతోందన్నారు. ఉద్యోగుల భద్రతపై చర్చించడానికి కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ బాధ్యతను ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో, ఎమ్మేల్యే కరుణాకర్ రెడ్డికు అప్పగించారు.