ఒక ఊరిలో తండ్రీ కొడుకులు నివసిస్తున్నారు. తండ్రి అదే ఊళ్ళో రెస్టారెంట్లో వంటచేసే పని చేసుకుంటున్నాడు. కొడుకు తనకు నచ్చిన పనేదో చేసుకుంటున్నాడు. . ఒకానొక రోజు డల్ గా ఉన్న కొడుకుని చూసిన తండ్రి, ఏమైంది అలా ఉన్నావు? అని అడిగాడు. దానికి కొడుకు, జీవితం చాలా బోరింగ్ గా తయారైంది. అన్నీ నాకు చిరాకుని పుట్టిస్తున్నాయి. ఏ పని చేసినా ఇబ్బందులే వస్తున్నాయి. ఏదీ నాకు కలిసి రావడం లేదు అని భోరుమన్నాడు. కొడుకుని అలా చూసిన తండ్రి, ఈరోజు ఒకసారి హోటల్ కి రా అని పిల్చాడు.
తన పని పూర్తి చేసుకున్న కొడుకు, రెస్టారెంట్ కి వెళ్ళాడు. అక్కడ తన కోసమే ఎదురుచూస్తున్న తండ్రి ముందుకు వెళ్ళాడు. తండ్రి, తన ముందు మూడు పొయ్యిలు వెలిగించి, వాటి మీద పాత్రలో ఒక దాన్లో క్యారెట్, మరొకదాన్లో గుడ్డు, ఇంకో దాన్లో కాఫీ గింజలు వేసి ఉడికిస్తున్నాడు. తండ్రి చేస్తున్నదేంటో అర్థం కాని కొడుకు, అలా చూస్తూనే ఉండిపోయాడు. ఆ ఉడుకుతున్న నీళ్ళలో నుండి వాటిని తీసి పక్కన పెట్టిన తండ్రి, క్యారెట్ ఇప్పుడెలా ఉంది అని అడిగాడు.
ఉడకడం వల్ల మెత్తగా అయ్యింది. అంతకుముందు గట్టిగా ఉండేది అన్నాడు. అదే గుడ్డుకి వచ్చేసరికి, పెంకు లోపలి భాగం వేడి నీటికి గట్టిగా మారింది. ఇక కాఫీ గింజల విషయానికి వచ్చేసరికి వేడి నీటి రంగు మాయమైంది. ఇదంతా చూసిన కొడుక్కి ఏమీ అర్థం కాలేదు. తండ్రి ఇలా అన్నాడు. పరిస్థితులు నిన్ను మెత్తగా చేయడం, గట్టిగా చేయడం కంటే ఆ పరిస్థితులనే మార్చేసేలా నువ్వు మారాలని అన్నాడు. అంటే కాఫీ గింజల్లా నువ్వు మారినప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురైనా జీవితం ఆహ్లాదంగా ఉంటుంది.
నీ గురించి నువ్వు బాధపడే ముందు నీకున్న పరిస్థితులను మార్చితే అసలు ఎలాంటి పరిస్థితికి భయపడాల్సిన అవసరం లేదని తేల్చేసాడు. డేర్ టు డూ మోటివేషన్ ఆధారంగా..