చాలా మందికి రాత్రికి రాత్రే ఫేమస్ అవ్వాలని ఉంటుంది. దాని కోసం రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొందరి దీంట్లో ఎక్స్ట్రీమ్ కి వెళ్తుంటారు. అలాగే ఓ యువకుడు కూడా ఫేమస్ అవ్వాలనుకున్నాడు. దాని కోసం ఏకంగా మర్డర్లే చేశాడు. ఓ యాక్షన్ సినిమా ప్రభావంతో సీరియల్ కిల్లర్ గా మారాడు.
కేవలం ఫేమస్ అయ్యేందుకే ఇప్పటివరకు ఐదుగురిని హతమార్చాడు. సెక్యూరిటీ గార్డులే లక్ష్యంగా హత్యలు సాగించాడు. ఓ కాపలాదారుడిపై దాడిచేస్తున్న వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. హత్యచేసిన ఓ వ్యక్తి వద్ద దొంగిలించిన ఫోన్ ఆధారంగా అతడిని పోలీసులు ట్రాక్ చేసి పట్టుకున్నారు. ఈ కేసులో దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మధ్యప్రదేశ్‌లోని సాగర్‌కు చెందిన శివప్రసాద్ (19) విపరీతంగా సినిమాలు చూసేవాడు. అయితే దక్షిణాదిలో రూపొంది పాన్‌ఇండియా స్థాయిలో రిలీజై కలెక్షన్ల వర్షం కురిపించిన ఓ యాక్షన్ సినిమా చూసి స్ఫూర్తి పొందిన శివ.. నేరాలు చేస్తూ ఫేమస్ అయిపోవాలని భావించినట్లు తేలింది. సాగర్ నగరంలో మూడు రాత్రుల్లో వరుసగా ముగ్గురు సెక్యూరిటీ గార్డులను శివ హతమార్చాడు. మే నెలలోనూ ఓ వ్యక్తిని చంపి.. అతడి ముఖంపై బూటును ఉంచాడు. నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డులే లక్ష్యంగా ఆ యువకుడు దాడులకు పాల్పడేవాడు.
తాజాగా గతరాత్రి భోపాల్‌లో ఓ మార్బుల్ దుకాణం వద్ద కాపలా ఉన్న సెక్యూరిటీ గార్డు సోను వర్మపై (23) మార్బుల్ రాయితో దాడిచేసి హతమార్చాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీప సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. వరుస హత్యల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా నిందితుడు శివను అదుపులోకి తీసుకున్నారు. హత్య చేసిన సమయంలో మృతుడి వద్ద దొంగిలించిన సెల్‌ఫోనే ఈ కేసులో నిందితుడిని పట్టుకోవడానికి ఆధారమైంది. పోలీసులు కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. అయితే, సెక్యూరిటీ గార్డుల తర్వాత పోలీసులే లక్ష్యంగా తన దాడులు కొనసాగించాలనుకున్నట్లు శివ చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు.