జనసేన అధినేత పవన్ కల్యాణ పుట్టిన రోజునే విజయవాడలో ఆ పార్టీ నాయకుడి అరెస్టు ఉద్రిక్తతకు దారితీసింది. విజయవాడ వన్‌టౌన్‌లోని రాయల్ హోటల్ సెంటర్ దగ్గర జనసేన పార్టీ జెండా దిమ్మె వద్ద ఘర్షణ జరిగింది. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన కార్యకర్తలు జెండా దిమ్మెకి రంగులేసి అలంకరించారు. ఆ దిమ్మె మాదంటూ వైకాపా నాయకులు అడ్డుపడ్డారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జనసేన కార్యకర్తలను అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేయగా.. ఘటనాస్థలికి చేరుకున్న జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేశ్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
ఒక దశలో జనసేన కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈక్రమంలో పోతిన మహేశ్‌ను అరెస్టు చేసి భవానీపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోతిన మహేశ్ మాట్లాడుతూ.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు కుట్రతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. జనసేన దిమ్మెలకు రంగులు వేయడం, వీలైతే అక్కడి నుంచి తొలగించడం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
దీనిపై ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు పోతిన మహేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలుసుకున్న ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున భవానీపురం చేరుకున్నారు. మహేశ్‌ను విడుదల చేయాలంటూ భవానీపురం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.