పంజాబ్ లో పలువురు కాంగ్రెస్ నాయకులు, వారి సన్నిహితుల ఇళ్లపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ) దాడులు చేస్తోంది. ముఖ్యంగా పంజాబ్ సీఎం చన్నీ సన్నిహితులపై ఈడీ రైడ్స్ నిర్వహించి కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వీటిపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు.
ఎన్నికలు వచ్చాయంటే చాలు కేంద్ర ఏజెన్సీలైన ఈడీ, సీబీఐ వంటివి యాక్టివ్‌గా మారుతున్నాయని విమర్శించారు కేజ్రీవాల్. మాకు ఉన్న సమాచారం ప్రకారం.. త్వరలో ఆప్ నాయకులు సత్యేంద్ర జైన్ ను కూడా అరెస్ట్ చేస్తుందనే సమాచారం ఉందని అన్నారు. ఆయనపై ఇప్పటికే రెండుసార్లు దాడులు చేసినా ఫలితం లేదని.. ఈసారి కూడా వారికి స్వాగతం పలుకుతున్నామని వ్యంగ్యంగా అన్నారు. మేము పంజాబ్ సీఎం చన్నీలా ఏడవమని..చన్నీ తప్పుచేశానన్న నిరాశకు లోనయ్యాడని.. మేం ఏ తప్పు చేయలేదు కాబట్టి భయపడమని కేంద్రానికి కౌంటర్ ఇచ్చారు. బీజేపీ అన్ని ఏజెన్సీలను పంపగలదని సత్యేంద్ర జైన్ మాత్రమే కాదు వారు నాకు, మనీష్ సిసోడియా, భగవంత్ మాన్‌లపైన కూడా రైడ్స్ చేయగలరని.. వారిని చిరునవ్వుతో స్వాగతిస్తాం అంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.