దిల్లీ అసెంబ్లీలో తన ప్రభుత్వంపై తానే స్వయంగా పెట్టుకున్న విశ్వాస తీర్మానంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజయం సాధించారు. మూజువాణి ఓటుతో.. విశ్వాస తీర్మానం ఆమోదం పొందింది. సభలో భాజపా సభ్యులు ఎవరూ.. లేకపోవడం వల్ల ఓటింగ్ చేపట్టలేదు. డిప్యూటీ స్పీకర్‌తో వాగ్వాదానికి దిగిన ముగ్గురు భాజపా సభ్యులను మార్షల్స్ బయటకు తీసుకెళ్లిపోయారు. మిగిలిన భాజపా సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలన్న భాజపా ‘ఆపరేషన్ లోటస్’ కార్యక్రమం విఫలమైందని కేజ్రీవాల్ ఆరోపించారు. జాతీయ స్థాయిలో రెండే పార్టీలు ఉన్నాయన్న ఆయన.. కరడుగట్టిన నిజాయితీ పార్టీ ఒకటి, అత్యంత అవినీతి పార్టీ మరొకటి అంటూ భాజపాపై పరోక్ష విమర్శలు చేశారు. విశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కమలనాథుల తీరును సీఎం కేజ్రీవాల్ తప్పుబట్టారు.
దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా ఇంటిపై సీబీఐ సోదాలతో గుజరాత్‌లో ఆమ్ ఆద్మీకి మరో 4శాతం ఓటింగ్ పెరిగిందన్నారు. సిసోదియాను అరెస్ట్ చేస్తే అది 6శాతంకు చేరుకుంటుందని తెలిపారు. సిసోదియా వద్ద ఏమీదొరకలేదన్న కేజ్రీవాల్.. ప్రధానమంత్రి ఆయనకు నిజాయితీ సర్టిఫికెట్ ఇచ్చారని చెప్పారు.