దేశంలోని నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానంగా చెప్పుకొస్తున్న ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించే లక్ష్యంగా ఆత్మ నిర్భర్ భారత్ రోజ్ గార్ యోజన పథకానికి శ్రీకారం చుట్టింది కేంద్రం. దీనికి బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది అంతేకాకుండా ఈ ఆర్థిక సంవత్సరానికి 1,584 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసేందుకు ఆమోదం తెలిపారు. కాగా 2020 నుంచి 2023 నాటికి దేశంలో 58.5 లక్షల మందికి ఉపాధిని కల్పించే లక్ష్యంగా మోదీ సర్కార్ ప్రయత్నిస్తుంది. ఈ పథకానికి మొత్తంగా 22,810 కోట్ల రూపాయలను వెచ్చించనున్నట్లు ప్రకటించింది
దేశంలో నిరుద్యోగం తీవ్ర స్థాయిలో ఉంది. కరోనా లాక్ డౌన్ కారణంగా నిరుద్యోగం తీవ్ర స్థాయికి పెరిగింది. 2014 ఎన్నికల ప్రచారంలో మోదీ వినిపించిన ప్రధాన నినాదాల లో ఉద్యోగ కల్పన ఒకటి. తాము అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని ప్రముఖంగా చెప్పుకొచ్చారు. అయితే అది వాస్తవంలో కార్యరూపం దాల్చలేదు. అంతేకాకుండా ఉద్యోగ కల్పన గురించి ఒక సందర్భంలో మోడీ చేసిన వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు తావు నిచ్చాయి. ప్రస్తుతం తీసుకు వస్తున్న పథకంపై దేశ ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయి.