ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనపై తప్పుడు ప్రచారం చేస్తుందని… సీనియర్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కుమారుడు చేతన్ సాయి కృష్ణ మండిపడ్డారు. ప్రభుత్వంలో కీలక అధికారిగా ఉండి పలు కొనుగోళ్ళలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఏబీని నాలుగు రోజుల క్రితం జగన్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ప్రభుత్వం కావాలనే అధికారులను టార్గెట్ చేస్తుందని టీడీపీ ఆరోపించింది.
ఇక తాజాగా తనపై వచ్చిన ఆరోపణలను ఏబీ కుమారుడు తప్పుబట్టారు. ఏపీ ప్రభుత్వానికి సంబంధించి తాను ఎలాంటి టెండర్లలోను పాల్గొనలేదని ఆయన స్పష్టం చేసారు. ప్రభుత్వం చేస్తున్న అభియోగాలతో తనకు ఏ విధమైన సంబంధము లేదన్న ఆయన, తాను చేసింది ప్రైవేట్ స్టార్ట్ అప్ లు తప్ప ఏ ప్రభుత్వానికి సంబంధించిన టెండర్ల లో పాల్గొన లేదని చేతన్ సాయి కృష్ణ తేల్చి చెప్పారు.
తన తండ్రి బాధ్యత కల్గిన ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి ఆయనకు కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి తాను ఈ ప్రకటన విడుదల చేస్తున్నానని చెప్పిన సాయి కృష్ణ ఇకనైనా తమపై చేస్తున్న విష ప్రయోగాలు ఆపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తే పరువునష్టం నష్టం దావా వేయడం తప్ప తనకు వేరే మార్గాలు లేవని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై టీడీపీ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.