ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ మూడో స్నాతకోత్సవంలో తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పాల్గొన్నారు. ఆయనతో పాటు.. ఈ కార్యక్రమంలో తమిళనాడు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ గీతాలక్ష్మి, కొండాలక్ష్మణ్ యునివర్సిటీ వీసీ నీరజ ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీపై ప్రశంసల జల్లు కురిపించారు.
తాను అబ్రహం లింకన్, ప్రధాని నరేంద్ర మోడీని ఇన్స్పిరేషన్గా తీసుకుంటానని గవర్నర్ రాధాకృష్ణన్ తెలిపారు. అబ్రహం గా లింకన్, నరేంద్ర మోడీ ఇద్దరు.. దేశ ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేసే వ్యక్తులు అని కొనియాడారు. చిన్న స్థాయి నుంచి వచ్చిన నరేంద్ర మోడీ ప్రపంచంలోనే విలువైన నాయకుడిగా ఎదిగారని పేర్కొన్నారు. దేశ వ్యవసాయ విధానాన్ని మెరుగుపరచడానికి మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందని.. 15 సంవత్సరాల క్రితం మన దేశంలో వనరులు చాలా పరిమితంగా ఉన్నాయన్నారు. ఇప్పుడు మనం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నామంటే.. మన విద్య ద్వారా మాత్రమే సాధ్యమైందని గవర్నర్ తెలిపారు. ఈ 15 ఏండ్లలో దేశంలో విద్యావ్యవస్థ చాలా మెరుగు పడిందని చెప్పుకొచ్చారు.