ఇప్పుడు ఏపీలో టీడీపీ పరిస్థతి మరీ దారుణంగా తయారవుతోంది. టీడీపీ నేతలు ఎలాంటి పనులు చేసినా సరే చివరకు దాన్ని వైసీపీ నేతలు నీరుగారుస్తున్నారు. ఇక ఇప్పుడు విశాఖ ఉక్కు ఉద్యమంలో కూడా ఇలాగే జరుగుతోంది. మొదటి నుంచి వైసీపీ ఈ విషయంపై ఆచితూచి అడుగులు వేస్తోంది. తాము తీసుకనే నిర్ణయం ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ప్రతిపక్ష టీడీపీకి చిక్కులు తెచ్చిపెట్టే విధంగా ఉండేలా జగన్ చూస్తున్నారు. ఇక ఇప్పుడు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అయిన అచ్చెన్నాయుడు చేసిన పని కూడా నీరుగార్చే పనిలో పడ్డారు.
ఆయన వైసీపీకి ధీటుగా పోరాటానికి దిగిన సంగతి అందరికీ విదితమే. కాగా ఆయన చేస్తున్న ఈ ఉద్యమాన్ని కాస్తా మొదట్లోనే ప్రజల్లోకి వెళ్లకుండా విమర్శలపాలయ్యేలా చేస్తున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. రీసెంట్ గా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ విశాఖ ఉక్కు కంపెనీని ప్రైవేటీకరించడం కోసం మొదటి నుంచి బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ జగన్ ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నాయంటూ ఆరోపించారు. ఇద్దరూ రహస్య ఒప్పందం చేసుకున్నారని దీన్ని క్షమించరాదని అన్నారు.
అయితే వెంటనే మంత్రి బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగి గతంలో మోడీ కేబినెట్లో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అశోక్ గజపతికి ఎందుకు ఈ విషయంపై మౌనంగా ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ అప్పుడు ఈవిషయం తెలిసి కూడా ఎందుకు వ్యతిరేకించలేదంటూ ప్రశ్నించారు. కానీ తాము మాత్రం ఇప్పుడు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా తీర్మాణం చేస్తున్నట్టు చెబుతున్నారు. గతంలో టీడీపీ కేంద్రంతో పొత్తులో ఉన్నప్పుడే ఈ విషయం తెరమీదకు వచ్చినా కూడా వారు అప్పుడు ప్రస్తావించినా ఇప్పుడు కావాలని రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.