చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. కోలీవుడ్‌కు చెందిన యువ నటి దీప అలియాస్ పౌలిన్(29) ఆత్మహత్యకు పాల్పడింది. చెన్నైలోని విరుగంబాక్కంలోని ఓ ప్రైవేట్ ఫ్లాట్‌లో ఉంటున్న దీప.. శనివారం తన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గత కొన్నాళ్లుగా ఒంటరిగా ఉంటున్న దీప.. మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని స్నేహితులు చెబుతున్నారు.
శనివారం దీపకు ఆమె కుటుంబసభ్యులు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆమె స్నేహితుడు ఫ్లాట్‌కి వెళ్లి చూడగా.. ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి, మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీప ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానిస్తున్నారు పోలీసులు. ఆమె ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలో సూసైడ్ నోట్ లభించింది. అందులో తన చావుకు ఎవరు కారణం కాదని చెబుతూనే.. జీవితాంతం ఒకరిని ప్రేమిస్తూనే ఉంటా అని రాసుకొచ్చింది.
పలు తమిళ సినిమాల్లో సహాయ నటిగా అలరించింది దీప. చిన్న పాత్రలు పోషించినా.. తనదైన నటనతో మంచి గుర్తింపు సంపాదించింది. ప్రస్తుతం హీరో విశాల్ నటించిన ‘తుప్పరివాలన్’ చిత్రంలో దీప నటిస్తోంది. నాజర్ నటించిన ‘వైదా’ చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషించింది.