కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల పట్ల నిబద్ధత ఉన్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తాజాగా ఆయన ఖమ్మం జిల్లా మధిరలో పర్యటించి.. అక్కడ మీడియాతో మాట్లాడారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సన్న బియ్యం ఇస్తామని కాలయాపన చేసిందని.. కానీ తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే అమలు చేశామని తెలిపారు. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో తాము ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు వేయబోమని ప్రకటించారు భట్టి విక్రమార్క.
ఇతర రాష్ట్రాలు తెలంగాణ సంక్షేమ మోడల్ ని ఆసక్తికరంగా చూస్తున్నాయన్నారు. రైతులకు రూ.2670 కోట్లు వడ్ల కు బోనస్ గా చెల్లించినట్టు తెలిపారు. రుణమాఫీ, రైతు భరోసా సొమ్ము చెల్లించినట్టు గుర్తు వెల్లడించారు. ఏడాదిన్నర కాలంలోనే యువతకు 50వేల ఉద్యోగాలు కల్పించినట్టు తెలిపారు. నిరుద్యోగ యువతకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రూ.9వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభించామని తెలిపారు. రాష్ట్రంలో 90 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. దేశంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని అన్నారు.