కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి పలువురు ప్రముఖలు తమకు తోచిన రీతిలో ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొందరు కరోనాపై పోరుకు తమ వంతు సాయంగా విరాళాలు అందజేస్తున్నారు. అయితే నటి శిఖా మల్హోత్రా మాత్రం కరోనా బాధితులను సాయం చేయడానికి వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. కరోనాపై పోరులో భాగంగా ప్రస్తుతం ఆమె స్వచ్ఛందంగా ముంబైలోని ఓ హాస్పిటల్‌లో నర్స్‌గా సేవ చేస్తున్నారు.
ఇందుకు సంబంధించి శిఖా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. నేను ఢిల్లీలోని వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజ్ అండ్ సఫ్దార్ జంగ్ నుంచి బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేశాను. అప్పట్లో నా సేవలను మీరు ప్రశంసించారు. ఇప్పుడు దేశానికి సేవ చేయడానికి మీ అందరి మద్దతు కావాలి. ఈ సారి కరోనాపై పోరాటంలో భాగంగా ముంబైలోని ఓ ఆస్పత్రిలో విధుల్లో చేరాను. ఓ నర్స్‌గా, నటిగా నా వల్ల చేతనైన సేవ నేను దేశానికి చేస్తాను. మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి. ఇంటి వద్ద ఉండండి.. సురక్షితంగా ఉండండి. ప్రభుత్వానికి సహకరించండి అని శిఖా కోరారు.
అలాగే ముంబైలోని హిందూ హృదయ సామ్రాట్ బాలా సాహెబ్ ఠాక్రే ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న ఫొటోలను శిఖా షేర్ చేశారు. కాగా, కాంచ్లీ లైఫ్ ఇన్ ఏ స్లాగ్ చిత్రంలో శిఖా నటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇండియాలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 979 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 25 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.