ఆదిలాబాద్‌ లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకి ఎర్త్ పెడుతున్న వ్యతిరేక వర్గం

-

ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నకు వ్యతిరేకంగా కొందరు నాయకులు ఏకమవ్వడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. మంత్రిగా నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు విజయం సాధించిన రామన్నకు మున్సిపల్‌ ఎన్నికల సమయంలో మొదలైన వైరం ఇప్పుడు టెన్షన్ పెడుతుంది.

ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కొంత కాలంగా ఎమ్మెల్యే జోగురామన్నకు సొంత పార్టీ నేతలకు మధ్య వైరం మొదలైంది. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీ చేసేందుకు అనుమతి ఇవ్వలేదనే కోపంతో కొందరు అసంతృప్తులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా జట్టు కట్టారు. ఎమ్మెల్యే కంటే ముందే స్థానిక సమస్యల పై స్పందిస్తూ స్థానిక రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. గతంలో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా పనిచేసిన మనీషా నేతృత్వంలో వీరు తమ కార్యకలపాలు సాగిస్తున్నారు.

నియోజకవర్గంలో వరుస పర్యటనలు చేస్తూ ఎమ్మెల్యేకి పొగ బెడుతున్నారు. జోగు రామన్న సొంత మండలంలో సైతం పర్యటన చేస్తుండటంతో ఆదిలాబాద్‌ అధికారపార్టీలో చీలికలు వచ్చాయన్న ప్రచారం జోరందుకుంది. అధికారిక అనధికారిక కార్యక్రమాలకు హాజరవుతూ గ్రూప్‌వార్‌ను కిందిస్థాయి బలంగా తీసుకెళ్తున్నారట.

మున్సిపల్‌ ఎన్నికల్లో జోగు రామన్న తన కుమారుడు జోగు ప్రేమేందర్‌ను మున్సిపల్‌ ఛైర్మన్‌ను చేశారు. ఆ సమయంలో తనకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకుండా పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఎమ్మెల్యే రామన్న. అప్పటికే ఛైర్‌పర్సన్‌గా ఉన్న మనీషాకు కౌన్సిలర్‌గా పోటీ చేసేందుకు కూడా అవకాశం కల్పించలేదని ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం ఆరోపిస్తోంది. అప్పటి నుంచే ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం ఏకమైనట్లు తెలుస్తుంది.

నియోజకవర్గంలో ఇన్నాళ్లూ టీఆర్‌ఎస్‌ నేత గోవర్దన్‌రెడ్డి ఒక్కరే రామన్నకు వ్యతిరేకంగా మాట్లాడేవారు. ఇప్పుడు ఆయన కంటే ధీటుగా మాజీ మున్సిపల్ చైర్మన్ మనీషా పవర్ రాజకీయం నడుపుతున్నారన్న చర్చ నియోజకవర్గంలో వినిపిస్తుంది. మనీషా పవర్‌రావ్‌కు పార్టీలో ఓ సీనియర్‌ నేత అండ ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేకి టిక్కెట్ రాకుడదన్న టర్గెట్ తో నేతలంతా ఏకమవుతున్నట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news