దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే రోజు రోజుకీ అనేక రాష్ట్రాల్లో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలోనే కరోనా కేసుల పెరుగుదలపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సర్వే చేసి ఓ నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఏప్రిల్-మే నెలల్లో ఉధృతం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరి 15వ తేదీ నుంచి దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం మొదలైనట్లు తెలుస్తుండగా ఆ తేదీని ప్రామాణికంగా తీసుకుంటే అప్పటి నుంచి 100 రోజుల వరకు కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఉంటుందని తెలుస్తోంది. ఈ దశలో దేశ వ్యాప్తంగా 25 లక్షల మందికి కరోనా సోకుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే ఏప్రిల్-మే నెలల్లో రెండో దశ కరోనా ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.
గత కొద్ది రోజులుగా మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, కర్ణాటక, చత్తీస్‌గడ్, గుజరాత్ రాష్ట్రాల్లో రోజువారీగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. మొత్తం కేసుల్లో 80 శాతం వరకు కోవిడ్ కేసులు ఈ రాష్ట్రాల నుంచే వస్తుండడం ఆందోళనకు గురి చేస్తోంది. కాగా ఎస్‌బీఐ ఈ మేరకు 28 పేజీలతో కూడిన ఓ నివేదికను విడుదల చేసింది.