కరోనా వైరస్ నేపథ్యంలో ప్రధాని మోదీ గతంలో 21 రోజుల దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే మరో 6 రోజుల్లో ఆ గడువు ముగియనున్నా.. దేశంలో ఇంకా కరోనా ప్రభావం తగ్గని నేపథ్యంలో.. లాక్ డౌన్‌ను మరో 14 రోజులు పొడిగిస్తారని తెలుస్తోంది. అయితే లాక్‌డౌన్ ఎత్తేశాక.. ప్రజలు విమానాల్లో ప్రయాణించాలనుకుంటే మాత్రం ఒక్కసారి ఆలోచించాల్సిందే. ఎందుకంటే.. ఇకపై విమానాల్లో ప్రయాణం అంత ఈజీ కాదు. ఎయిర్‌పోర్టుకు చేరుకున్నది మొదలు విమానం ఎక్కి, దిగే వరకు ఎన్నో గంటల విలువైన సమాయాన్ని ప్రయాణికులు కోల్పోవాల్సిందే. అందుకు సిద్ధపడితేనే ఎవరైనా విమాన ప్రయాణం చేయాలి. ఇక అక్కడితోనే ఆగలేదు. ఇంకా ఏమేం కఠిన నిబంధనలను అమలు చేయనున్నారో.. ఒక్కసారి చదివి తెలుసుకోండి..!
లాక్‌డౌన్ నేపథ్యంలో విమానయాన రంగం తీవ్రంగా నష్టపోతుందని తెలిసిందే. అయితే లాక్‌డౌన్ ఎత్తేశాక విమాన సర్వీసులు మళ్లీ ప్రారంభమైనా.. ఆ రంగానికి చెందిన సంస్థలకు నష్టాలు ఇంకా ఎక్కువవుతాయని తెలుస్తోంది. ఎందుకంటే.. లాక్‌డౌన్ అనంతరం విమానాలను నడిపించేందుకు గాను పలు నియమాలను ఆయా సంస్థలు తప్పనిసరిగా పాటించాలని ఇప్పటికే డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. విమానం ఎక్కేందుకు ఇకపై ప్రయాణికులు కనీసం 4 లేదా 5 గంటల ముందు ఎయిర్‌పోర్టుకు చేరుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారు చెక్ ఇన్, బోర్డింగ్ అయ్యేందుకు మరో 2 లేదా 3 గంటల సమయం.. విమానం ఎక్కి గమ్యస్థానం చేరుకునేందుకు మరో 3 నుంచి 4 గంటల సమయం పట్టనుంది. ప్రయాణికులను లగేజీ చెక్ మొదలుకొని విమానంలో ఎక్కేందుకు అనుమతించే వరకు, దిగేటప్పుడు, ఆ తరువాత మళ్లీ లగేజ్ చెక్ సమయంలో సామాజిక దూరాన్ని పాటించనున్నారు. అందుకనే విమాన ప్రయాణం చాలా ఆలస్యం కానుంది.
ఇక విమానాల్లో మధ్యలో సీటును ఖాళీగా వదలనున్నారు. కేవలం విండో, ఐసిల్ సీట్లను మాత్రమే ప్యాసింజర్లతో భర్తీ చేయాల్సి ఉంటుంది. సామాజిక దూరం పాటించడం తప్పనిసరి. దీంతో 180 మంది ప్రయాణించే ఒక విమానంలో 105 నుంచి 110 మంది మాత్రమే వెళ్తారు. దీంతో విమాన సంస్థలు ఆదాయం కోల్పోవాల్సి వస్తుంది. అలాగే ఎయిర్‌పోర్టులో ఇకపై స్క్రీనింగ్ పరీక్షలను మరింత కఠినంగా చేయనున్నారు. అలాగే ప్రయాణికులు కచ్చితంగా 3 నుంచి 4 అడుగుల సామాజిక దూరం పాటించాల్సి ఉంటుంది. ఇక అంతకు ముందు విమానంలో ప్రయాణికులను 10 వరుసల్లో ఒకేసారి ఎక్కించేవారు. కానీ ఇకపై కేవలం 2 నుంచి 3 వరుసల్లో మాత్రమే ప్రయాణికులను విమానంలోకి ఎక్కిస్తారు. దీంతో చాలా సమయాన్ని ప్రయాణికులు త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇక ప్రయాణికులకు అందించే ఆహార ప్యాకెట్లను కూడా ముందుగానే వారి వారి సీట్ల వెనుక ఉండే పాకెట్లలో ఉంచనున్నారు. దీంతో ప్రయాణ సమయం మరింత పెరుగుతుంది.
కాగా ఇంతకు ముందు 1 గంట జర్నీ ఉండే ఫ్లైట్ బోర్డింగ్ ప్రాసెస్ 45 నిమిషాలుగా ఉండేది. కానీ ఇప్పుడు బోర్డింగ్ ప్రాసెస్ మొదలుకొని ప్రయాణికులు గమ్యస్థానం చేరే వరకు సమయం 5 నుంచి 6 గంటల వరకు పట్టవచ్చని తెలుస్తోంది. ఇక లాక్‌డౌన్ వల్ల దేశంలో విమానయాన రంగానికి 3.6 బిలియన్ల డాలర్ల వరకు నష్టం కలగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా.. లాక్‌డౌన్ ఎత్తేశాక.. విమాన ప్రయాణం అంటే.. నిజంగా.. ప్రయాణికులు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిందే.. ఏమంటారు..!