“ప్రతి విషయానికీ కులం రంగు పూస్తారా? ప్రతి అంశాన్నీ కులం కోణంలోనే చూస్తారా? ప్రతి అధికారికీ కులాన్ని ఆపాదిస్తారా ?!“-ఇదీ కొన్నాళ్ల కిందట టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు, మాజీ మంత్రి లోకేష్ లు ప్రభుత్వం పైనా.. సీఎం జగన్‌పైనా చేసిన విమర్శ. భారీ ఎత్తున బాబు అనుకూల మీడియా కూడా సీఎం జగన్‌ను ఉద్దేశించి కులాన్ని పట్టు కుని ఊగిసలాడుతున్నారంటూ కథనాలు ప్రచారం చేసింది. ఏపీ ఎన్నికలకమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ స్థానిక ఎన్నికలను వాయిదా వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం జగన్.. ఆయనపై విరుచుకుపడిన సందర్భంలో చంద్రబాబు.. అండ్ పార్టీ ఇలా విరుచుకుపడింది.
కట్ చేస్తే.. ఇప్పుడు అవే నీతులు ఆ పార్టీకి చెప్పాల్సిన పరిస్థితిని బాబు తనయుడు చిన్నబాబు సృష్టించుకున్నారు. తాజాగా ఓ స్థానిక ఆసుపత్రిలో చేసే వైద్యుడు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏదైనా సమస్య ఉంటే.. అంతర్గతంగా అధికారులకు చెప్పి పరిష్కరించుకోవాల్సిన ఆయన వెంటనే మీడియాకు ఎక్కారు. ఆయనేమన్నా రాష్ట్ర స్థాయి వైద్యుడా అంటే కాదు. కానీ, డాక్టరే కాబట్టి ప్రస్తుత సమయంలో ఆయనకున్న ఆవేదన ఏదైనా ఉంటే.. ప్రభుత్వానికి లిఖిత పూర్వకంగా చెబితే సరిపోయేది . కానీ, ఆయన వెంటనే బాబు అనుకూల మీడియాకు ఎక్కారు.
ప్రభుత్వం, సీఎం జగన్‌పైనా వైద్య ఆరోగ్య శాఖపైనా విమర్శలు చేశారు. అయినా ప్రభుత్వం ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేయలేదు. సదరు డాక్టర్ చెప్పిన విషయాలపై నిజం ఎంత? అనే విషయాన్ని మాత్రమే పరిశీలించింది. ఈ క్రమంలోనే కమిటీ వేసింది. సదరు కమిటీ సూచనల మేరకు ఆయనను సస్పెండ్ చేసింది. అయితే, ఇది ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ఏపీ సీఎం జగన్, వైసీపీ నేతలపై ఏపీ లోకేష్ విమర్శలు గుప్పించారు. మీ ఇగో హర్ట్ అయ్యిందని దళిత వైద్యుడిపై మీ ప్రతాపం చూపిస్తారా అని లోకేష్ మండిపడ్డారు. నర్సీపట్నం ఆస్పత్రి డాక్టర్ సుధాకర్ సస్పెన్షన్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని లోకేష్ ట్వీట్ చేశారు.
కరోనాపై పోరాడుతున్న డాక్టర్లు, వైద్య సిబ్బందికి మాస్కులు, వ్యక్తిగత రక్షణ కిట్లు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం అని లోకేష్ మండిపడ్డారు. మాస్కులు అడిగితే సస్పెండ్ చెయ్యడం జగన్ అధికార మదానికి నిదర్శనమని విమర్శించారు. అయితే, ఇక్కడ విషయం చిన్నదే.. అయినప్పటికీ.. వెంటనే సదరు డాక్టర్ దళితుడని లోకేష్ చెప్పడం, వెంటనే విషయాన్ని దళితుల కోణంలో చూడడం బాగోలేదని అంటున్నారు పరిశీలకులు. అదే డాక్టర్ దళితుడు కాకపోతే..నువ్వు మాట్లాడవా? అంటున్నారు. ఏదేమైనా.. నీతులు చెప్పే నాయకులు ఇలా వ్యవహరించడం సబబా? అనేది విజ్ఞుల మాట!.