కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి రాకపోకలను ప్రభుత్వాలు నిలిపివేసాయి. ఈ క్రమంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం రద్దు చేసింది. లాక్ డౌన్ సడలింపులిచ్చి ఇన్ని రోజులైనా ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలను పునరుద్దరించలేదు. ఈ క్రమంలోనే ఈ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన ఆర్టీసీ కీలక అధికారులు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు కూడా సమావేశం అయినప్పటికీ అంతరాష్ట్ర ఒప్పందం కుదరలేదు.
ఒప్పందం కుదరకపోవడంతో ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య నడుస్తున్న ప్రైవేట్ సర్వీసులకి ఆదాయాన్ని పెంచే కంటే మనమే బస్సులు నడపాలని ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు సమావేశం అవడంతో దసరా కన్నా తాత్కాలికంగా బస్సులు నడుపుతారని అంతా భావించారు. కానీ అదేమీ లేకుండానే, ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ఆర్టీసీ ఈడీల సమావేశం ముగిసింది. రెండు మూడు రోజుల్లో మరోసారి సమావేశం అయ్యి తుది నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ఆర్టీసీ ఈడీ పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు చెరో లక్షా 61 వేల కిలోమీటర్ల మేర బస్సులు నడపాలని ప్రతిపాదనలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో చర్చించి నిర్ణయం చెబుతామని ఏపీ అధికారులు పేర్కొన్నారని ఆయన అన్నారు.