కీలక నేతలు దూరమై.. తీవ్ర ఇక్కట్లలో ఉన్న టీడీపీకి మరో గట్టి దెబ్బ తగలనుందా? పార్టీపై విశ్వాసం లేకో.. లేక వ్యక్తిగత కారణా లతోనో.. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్లపై విజయం సాధించిన ఎమ్మెల్యేలు ఇప్పుడు గుండుగుత్తుగా జగన్‌కు జై కొట్టేందుకు రెడీ అవుతున్నారా? టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వారిని నిలువరించే ప్రయత్నాలు చేయలేకపోతున్నారా? ఇప్పుడు ఇవే అంశాలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. రాజకీయాల్లో జంపింగులు మామూలే. ఒక పార్టీలో గెలిచి.. మరోపార్టీలో చేరిన నాయకులు గతంలోనూ ఉన్నారు. అయితే.. అప్పటి అవసరాలు వేరు.. ప్రస్తుతం ఉన్న అవసరాలు వేరు. దీంతో ఎవరు ఎందుకు మారుతున్నారో.. కూడా అంతుచిక్కడం లేదని అంటున్నారు పరిశీలకులు.
ఏదేమైనా.. టీడీపీ నుంచి ఇప్పటి వరకు దాదాపు నలుగురు ఎమ్మెల్యేలు జంప్ చేశారు. నేరుగా వైసీపీ కండువా కప్పుకోకపోయినా.. వారు మాత్రం వైసీపీకి మద్దతు ప్రకటించారు. అంతేకాదు, వీరిలో ఇద్దరు తమ కుమారులను నేరుగా పార్టీలో చేర్చారు. కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో ప్రారంభమైన జంపింగుల పర్వం.. వాసుపల్లి గణేష్ వరకు కొనసాగింది. ఇంకా కొనసాగుతూనే ఉంటుందని వైసీపీ వర్గాలే చెబుతుండడం గమనార్హం. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం.. తన కుమారుడు వెంకటేష్‌ను వైసీపీలో చేర్చారు. అదేసమయంలో తాను కూడా మద్దతు దారుగా మారారు. ఇక, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గిరి కూడా పార్టీకి దూరంగా ఉంటూ.. వైసీపీకి చేరువయ్యారు.
ఇక, ఎన్నాళ్లుగానో.. చేరతారనే ప్రచారం జరుగుతున్న విశాఖ ఉత్తర ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా త్వరలోనే పార్టీ మారతారని,(అంటే ఆయన కుమారుడు రవితేజను వైసీపీలో చేర్చి తాను మద్దతుదారుగా ఉంటారు) ఆయనకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం ఉంది. వీరితో టీడీపీ బలం 23 నుంచి 18కి పడిపోతుంది. వాస్తవానికి ఇప్పటికే 19 మంది ఉన్నారు. గంటా రాకతో మరో వికెట్ పడితే.. ఇది 18కి చేరుతుంది. అయితే, వీరితోపాటు.., విశాఖ క్యాపిటల్ ప్రకటించిన నేపథ్యంలో మరికొందరు కూడా వైసీపీ వైపు చూస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. వీరిలో గణబాబు కూడా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.
కేవలం వైజాగే కాకుండా.. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లోనూ టీడీపీ నుంచి నేతలు వైసీపీ బాట పడతారని చెబుతున్నారు. ఈ నెలలో ఇద్దరో ముగ్గురో నేతలు పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని, అదేవిధంగా.. వచ్చే నెలలో మరో నలుగురు వచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సీఎం జగన్.. కేంద్రంతో ముడిపడిన అనేక విషయాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఆయన ఢిల్లీ టూర్ పెట్టుకున్నారని, ఒకటి రెండు రోజుల్లో జంపింగులపై దృష్టి పెడతారని, అప్పుడు టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంటుందని అంటున్నారు వైసీపీ నాయకులు. మొత్తానికి టీడీపీ నుంచి ఇలాజంపింగుల పర్వం కొనసాగితే.. కష్టమేననేది విశ్లేషకుల అభిప్రాయం. మరి ఏం జరుగుతుందో.. చంద్రబాబు ఏం చేస్తారో ? చూడాలి.
-vuyyuru subhash