దేశవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. గతేడాదిలో నమోదు కాని కేసులు తాజాగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఆస్పత్రులు సైతం నిండిపోతున్నాయి. అయితే కరోనా బాధితులకు వైద్యం అందించడం అంత సులభమైన పని కాదు. వైద్యులు, సిబ్బంది ఎన్నో జాగ్రత్తలు తీసుకుని చికిత్స చేయాల్సి ఉంటుంది. అయితే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. బాధితుల సంఖ్య పెరగడం.. ఆస్పత్రులు ఫుల్ అవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బాధితులను హోం ఐసోలేషన్‌లోనే ఉంచి వైద్యం అందించాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు సూచిస్తోంది. అయితే క్వారంటైన్‌లో ఉన్న చాలా మందికి ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలో స్పష్టమైన అవగాహన లేదు. ఇంట్లోనే ఉంటూ బాధితులు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల గురించి కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
బాధితులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
కరోనా వైరస్ సోకిన వారిన ఒక సపరేట్ గదిలో ఉంచాలి. ఈ గదికి వెంటిలేషన్ జరిగేలా ఉండాలి. బాధితులు ధరించే బట్టలు.. తినే తిండి.. వాడే టాయిలెట్‌ను వెరొకరు వాడటానికి వీలు లేదు. బాధితుడికి ఒక సహాయకుడు తప్పనిసరిగా ఉండాలి. ఇంట్లో వృద్ధులు, గర్భిణులు, క్యాన్సర్, ఆస్తమా బాధితులు ఉంటే వారిని వేరే ఇంటికి తరలించాలి. కరోనా బాధితులు తప్పనిసరిగా ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వ ఆరోగ్య సిబ్బంది ప్రతిరోజు ఫోన్ చేసి తగిన సూచనలు అందిస్తుంది. ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్థాలను తీసుకోవాలి. గోరు వెచ్చని నీళ్లు తాగాలి.
సహాయకుడు.. బాధితుడి దగ్గరికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించి వెళ్లాలి. సామాజిక దూరం పాటించాలి. పీపీఈ కిట్ ధరిస్తే ఇంకా మంచింది. బాధితుడు కూడా రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు మాస్క్ ధరించాలి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా బాధితుడి వాడిన కర్చీఫ్, టిష్యూలు, దుస్తువులు, ఇతర వస్తువును పెద్ద ప్లాస్టిక్ కవర్‌లో వేసి భూమిలో పూడ్చిపెట్టాలి లేదా కాల్చివేయాలి. ఐసోలేషన్ గదిని రోగులే శుభ్రం చేసుకోవాలి. ప్రతి రోజు సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో గదిలో, గది పరిసర ప్రాంతాల్లో పిచికారీ నిర్వహించాలి. మద్యం, సిగరెట్లకు దూరంగా ఉండాలి. పదేపదే చేతులను ముఖానికి తాకవద్దు. అలాగే ప్రతి పది నిమిషాలకు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఫ్రూట్స్, బాదం పప్పులు, పాలు, గుడ్డు, ఆకుకూరలను ఆహారం తీసుకోవాలి. అలాగే ప్రతిరోజు ఉదయం వ్యాయామం చేయాలి. అప్పుడే శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరిగి వైరల్ నియంత్రణలోకి వస్తుంది.