ఏపీలో గత కొద్ది రోజులుగా జరుగుతోన్న పరిణామాలను పరిశీలిస్తే ప్రధానంగా హిందూ దేవాలయాల్లో ఏదో ఒక అపశృతి జరగడం.. దానిని సీఎం జగన్‌కు, వైసీపీ ప్రభుత్వానికి అంటకడుతూ అటు టీడీపీ, ఇటు బీజేపీ నేతలు విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. ఇక సోషల్ మీడియాలో జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక హిందూ దేవాలయాల్లో జరిగిన 20 సంఘటనలను విస్తృతంగా వైరల్ చేస్తున్నారు. అంటే కేవలం జగన్ ప్రభుత్వం ఏర్పాడ్డాక హిందువులు, హిందూ దేవాలయపై దాడులు జరుగుతున్నాయన్న విషయం ప్రతిబింబించేలా ఓ పథకం ప్రకారం ఇదంతా జరుగుతోందని అర్థమవుతోంది.
గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క విజయవాడలోనే కృష్ణా పుష్కరాల పేరు చెప్పిన అనేక దేవాలయాలను కూల్చేశారు. అప్పడు విమర్శలు వచ్చినా ఈ స్థాయిలో ప్రభుత్వం హిందూ మతానికి వ్యతిరేకంగా వెళుతుందన్న కోణంలో అయితే ప్రచారం చేయలేదు. అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం, జగన్ హిందూ మతానికి పూర్తి వ్యతిరేకం అన్న ముద్ర వేసే ప్రచారమే ఎక్కువుగా నడుస్తోంది. ఇక అంతర్వేది రథం దహనం జరిగాక ఈ విషయంలో అన్ని పార్టీలు జగన్‌ను టార్గెట్‌గా చేసుకున్నా… హిందూత్వ వాదాన్ని బలంగా తలకు ఎత్తుకునే బీజేపీ దీనిని బాగా హైలెట్ చేసేందుకు ప్రయత్నించింది.
ఈ సంఘటన వేడి చల్లారక ముందే నిన్న విస్సన్నపేటలో గుడి గోడ కూలిపోవడం, ఈ రోజు కృష్ణా జిల్లాలో ఓ దేవతా విగ్రహాన్ని ఆనుకుని ఉన్న పోతురాజు విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేయడంతో ఈ పరిణామాలు ఎలా జరిగినా కూడా ఇవి ప్రభుత్వ దాడుల కోణంలోనే చూపించే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇవి స్థానికంగా జరిగినా, సహజ సిద్ధంగా జరిగినా కూడా మతతత్వ దాడులుగా హైలెట్ చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్తితుల్లో కుల రాజకీయాలు చేసి జగన్‌ను బలహీనం చేసే పరిస్థితి లేదు.
అందుకే ఇప్పుడు జగన్ టార్గెట్‌గా మత రాజకీయం చేసేందుకే ఈ కుట్రలకు ప్లాన్ చేస్తున్నారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దాడుల వెనక జగన్ ప్రభుత్వాన్ని మాత్రమే దోషిని చేసే స్కెచ్ వెనక భారీ కుట్రే ఉందని చర్చలు నడుస్తున్నాయి.
-vuyyuru subhash